Begin typing your search above and press return to search.

రూ.250 కోట్ల స్టేడియం.. 8 మ్యాచ్ లు.. 3 నెలలు.. తుక్కుతుక్కు

నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం పిచ్.. డ్రాప్‌- ఇన్‌ పిచ్‌. స్టేడియంలోని నేల అనువుగా లేకపోతే ఈ పిచ్‌ లను ఉపయోగిస్తారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 3:30 PM GMT
రూ.250 కోట్ల స్టేడియం.. 8 మ్యాచ్ లు.. 3 నెలలు.. తుక్కుతుక్కు
X

క్రికెట్ లో సాధారణ టోర్నీలు నిర్వహించడమే కష్టం.. అలాంటిది ప్రపంచ కప్ నకు ఆతిథ్యం అంటే మాటలు కాదు.. అందులోనూ అమెరికా వంటి దేశంలో టి20 వరల్డ్ కప్ జరగడం అంటే అది విశేషమే. కానీ, మ్యాచ్ లు టెస్టుల్లా జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అదులోనూ న్యూయార్క్‌ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం మీద. ప్రపంచ కప్ లీగ్‌ దశలో ఈ స్టేడియంలో ఎనిమిది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులోనే ఈ నెల 9న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది.

స్వల్ప స్కోర్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌ కు మధ్య బ్యాలెన్స్ కరువు, ఛేజింగ్ కు దిగిన జట్టుకే గెలుపు అవకాశాలు ఉండడం తదితర అంశాల్లో క్రికెట్ నిపుణులు, వీరాభిమానులు నసావు స్టేడియంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టేడియాన్ని సరైన పిచ్‌గా మార్చేందుకు ‘ప్రపంచ స్థాయి గ్రౌండ్ బృందాలు’ కృషి చేస్తున్నాయని ఐసీసీ వెల్లడించింది. ఈ పిచ్‌ లపై రెగ్యులర్‌ గా మ్యాచ్ లు జరగని విషయాన్ని ప్రస్తావించింది. అయితే, ఈ నెల 5న భారత్, ఐర్లాండ్‌ మ్యాచ్ ముగిసిన తర్వాత ఐసీసీ ఈ ప్రకటన చేసింది. కానీ, తర్వాత భారత్-పాక్ మ్యాచ్ సహా జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ పరిస్థితి మారలేదు.

డ్రాప్ ఇన్ పిచ్ కావడంతో

నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం పిచ్.. డ్రాప్‌- ఇన్‌ పిచ్‌. స్టేడియంలోని నేల అనువుగా లేకపోతే ఈ పిచ్‌ లను ఉపయోగిస్తారు. బయట తయారు చేసి.. స్టేడియానికి తరలిస్తారు. నిర్ణీత ప్రదేశంలో అమరుస్తారు. న్యూయార్క్‌ మైదానంలో వాడేందుకు 10 డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ లను తయారు చేశారు. ఇందులో నాలుగు మ్యాచ్‌ల కోసం, మిగతావి వార్మప్‌ మ్యాచ్‌ల కోసం.

కూల్చేసి.. తుక్కు కింద అమ్మకం..

భారత్-అమెరికా మధ్య బుధవారం జరగనున్న మ్యాచ్ నసావు స్టేడియంలో చివరిదిగా తెలుస్తోంది. అనంతరం స్టేడియాన్ని కూల్చివేస్తారని సమాచారం. టి20 ప్రపంచ కప్ కోసమే ఈ స్టేడియాన్ని నిర్మించారు. రూ.240 కోట్లు ఖర్చు చేశారు. మూడు నెలల్లోనే పూర్తి చేశారు. డ్రాప్ ఇన్ పిచ్ లపై జరిగిన మ్యాచ్ లలో అన్నీ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి.