సంచలనం... మైక్ టైసన్ కు యూట్యూబర్ చేతిలో ఓటమి!
బాక్సింగ్ కింగ్, బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ ఫేమస్ మైక్ టైసన్ కు బిగ్ షాక్ తగిలింది.
By: Tupaki Desk | 16 Nov 2024 6:59 AM GMTబాక్సింగ్ కింగ్, బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ ఫేమస్ మైక్ టైసన్ కు బిగ్ షాక్ తగిలింది. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి అడుగుపెట్టిన మైక్ టైసన్ కు ఓటమి ఎదురైంది. దిగ్గజ బాక్సర్ కు 27 ఏళ్ల యంగ్ యూట్యూబర్ రింగ్ లో స్టార్స్ చూపించాడు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అవును... సుమారు ఇరవై ఎళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి దిగిన దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ను యూట్యూబర్ జేక్ పాల్ (27) ఓడించాడు. మైక్ టైసన్ మునుపటి ఉత్సహం చివరివరకూ చూపించలేకపోవడంతో ఓటమిపాలయ్యారు. తాజాగా జరిగిన పోరులో 74-78 తేడాతో పరాజయం చవిచూసిన పరిస్థితి నెలకొంది.
వాస్తవానికి ఈ బౌట్ ప్రారంభానికి ముందు నుంచీ, ప్రారంభమైన మొదటి రెండు రౌండ్ల వరకూ మైక్ టైసన్ గెలుస్తారనే అంతా భావించారు. వారి అంచనాలకు బలం చేకూరుస్తూ... బౌట్ ప్రారంభమైన తర్వాత మొదటి రెండు రౌడ్లలో 58 ఏళ్ల టైసన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. దీంతో... మొదటి రెండు రౌండ్లలో పరిస్థితి 10-9, 10-9 గా ఉంది.
అయితే ఆ తర్వాత లెక్క మారిపోయింది. మైక్ టైసన్ ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. వీరిద్దరిమధ్య మొత్తం ఎనిమిది రౌండ్లు జరగ్గా... మొదటి రెండు రౌండ్లలో మాత్రమే టైసన్ ఆధిపత్యం ప్రదర్శించారు. మిగిలిన ఆరు రౌండ్లలోనూ వరుసగా జేక్ పాల్ గెలుచుకున్నాడు. దీంతో... విజయం పాల్ ను వరించింది.
కాగా... బాక్సింగ్ రింగ్ లో మహారాజుగా ఓ వెలుగు వెలుగు వెలుగుతూ.. వివాదాలను వెంటేసుకుని తిరిగిన మైక్ టైసన్ 2005లో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే! తాజాగా యూట్యూబర్ తో తలపడ్డాడు. ఈ పోరుకు ముందు స్పందిస్తూ.. ఫ్యాన్స్ కోసం గెలుస్తానని అన్నాడు టైసన్.
ఇక... టైసన్ ఓ యూట్యూబర్ తో తలపడిన ఈ పోరు సందర్భంగా అమెరికా, భారత్ లలో నెట్ ఫ్లిక్స్ కాసేపు షట్ డౌన్ అయినట్లు వార్తలొచ్చాయి. ఈ బౌట్ లో తలపడటం కోసం టైసన్ సుమారు రూ.168 కోట్లు.. పాల్ దాదాపు రూ.337 కోట్లు పొందనున్నట్లు చెబుతున్నారు!