ఒక్క పరుగుతో నేపాల్ కల భగ్నం.. బ్యాడ్ లక్ కు పెద్దన్న చేతిలోనే
మన పొరుగు దేశం నేపాల్ గురించి తెలుసు కదా..? నాలుగైదు నెలల కిందట మంగోలియాతో టి20 మ్యాచ్ లో ఏకంగా 300పైగా రికార్డు స్కోరు కొట్టింది.
By: Tupaki Desk | 15 Jun 2024 6:25 AM GMTఅసలే తక్కువ స్కోర్లు.. చిన్న జట్ల సంచలనాలు.. అటువైపేమో బ్యాడ్ లక్ కు పెద్దన్న లాంటి జట్టు.. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ లో ఓ మ్యాచ్ అత్యంత ఆసక్తి కలిగించింది. ఓ చిన్న జట్టు అడుగు ముందుకు వేస్తుందా? అనే సందర్భం ఎదురైంది. చివరకు అదేమీ జరగలేదు. ఆ జట్టు కల చెదిరింది..
ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే..
మన పొరుగు దేశం నేపాల్ గురించి తెలుసు కదా..? నాలుగైదు నెలల కిందట మంగోలియాతో టి20 మ్యాచ్ లో ఏకంగా 300పైగా రికార్డు స్కోరు కొట్టింది. ఈ జట్టు ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ లో ఆడుతోంది. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ లతో పాటు ఈ జట్టూ ఉంది. శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బంగ్లాతో ఆడాల్సి ఉంది. అయితే, నేపాల్ కు కాస్త ‘సూపర్-8’ ఆశలు ఉన్నాయి. కానీ, దక్షిణాఫ్రికా ఒకే ఒక్క పరుగుతో వాటిని కూల్చేసింది.
శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. కానీ, నేపాల్ ను సఫారీ బౌలర్ షంసీ దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు, 18వ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అప్పటికీ ఆఖరి ఓవర్ లో విజయానికి 8 పరుగులు అవసరం. దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్ మన్.. నేపాల్ బ్యాటర్లను కట్టడి చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. గుల్సాన్ ఝాను ఔట్ చేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ గెలిస్తే సూపర్-8 రేసులో ఉండేది.
నేపాల్ చివరి 16 బంతుల్లో 4 వికెట్లు కోల్పోవడంతో పెద్ద సంచలనం రేపే అవకాశం కోల్పోయింది. అసలు దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాడ్ లక్ టీమ్ అన్న పేరుంది. ఒత్తిడిలో పూర్తిగా చేతులెత్తేస్తుంది. లేదా వర్షం వచ్చి ఆ జట్టును దెబ్బకొడుతుంది. కానీ, ఈ సారి టి20 ప్రపంచ కప్ లో నిలకడగా ఆడుతోంది.