Begin typing your search above and press return to search.

కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్.. సైనాపై మాస్ ట్రోలింగ్!

ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కు దూరమైన సెనా.. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

By:  Tupaki Desk   |   14 Aug 2024 9:04 AM GMT
కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్.. సైనాపై మాస్ ట్రోలింగ్!
X

భారతీయులకు జావెలిన్ త్రో గురించి 10 ఏళ్ల కిందటి వరకు తెలియదా..? అసలు అలాంటి క్రీడ అథ్లెటిక్స్ లో ఉందని తెలియదా..? ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని ఏమనాలి...అందులోనూ ఓ ప్రసిద్ధ ప్లేయర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏమనుకోవాలి..? అసలే సోషల్ మీడియా కాలం.. ట్రోలింగ్ కు ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా? అని ఎదురుచూసే నెటిజన్లు ఉన్న లోకం.. సరిగ్గా ఇలానే అడ్డంగా దొరికిపోయింది ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. దీంతో ఆమెను మాస్ ర్యాగింగ్ చేశారు నెటిజన్లు.

ఇంతకూ ఏం జరిగిందంటే..

ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కు దూరమైన సెనా.. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే, ఇటీవల ఒలింపిక్స్ లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోయిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అంశమై ఓ పాడ్ కాస్ట్ లో సైనా మాట్లాడింది. ఆ సంభాషణ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్‌ లో నీరజ్ చోప్రా జావెలిన్‌ త్రో లో బంగారు పతకం సాధించిన అంశం ప్రస్తావన తెచ్చింది. వాస్తవానికి ఆ పాడ్ కాస్ట్ లో సైనా చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. కానీ, ఒక్కచోట తప్పటడుగు వేసింది.

ట్రలోర్లకు దొరికేసింది..

‘‘నీరజ్.. టోక్యోలో స్వర్ణం తెచ్చాడు.. ఆ తర్వాతనే అథ్లెటిక్స్‌ లో ఇలాంటి ఒక ఈవెంట్‌ ఉందని తెలిసింది’’ అంటూ సైనా మాట్లాడాంది. వాస్తవానికి భారతీయులకు జావెలిన్ త్రో గురించి బాగానే పరిచయం. మనకు అందులో ఒలింపిక్ పతకాలు వచ్చి ఉండకపోవచ్చు.. కానీ ఆ ఆటపై మంచి అవగాహనే ఉంది. ప్రపంచ చాంపియన్లు ఎవరనేది కూడా కొందరు అభిమానులు చెప్పగలరు. కానీ, సైనా నెహ్వాల్ మాత్రం జావెలిన్ త్రో మనకు అసలు తెలియదు అనే ఉద్దేశంలో మాట్లాడింది. దీంతో ట్రోలర్లకు దొరికిపోయింది. కొందరు ఆశ్చర్యపోగా.. మరికొందరు ఇదే అదనుగా చెలరేగిపోయారు. ‘కంగనా రనౌత్ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (క్రీడల్లో కంగనా రనౌత్)’ అంటూ ఒకరు తీవ్రమైన పదజాలంతో కామెంట్ చేశాడు.

విమర్శించడం కాదు..

అయితే, సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్‌ కు దిగడాన్ని సైనా సవాల్ చేసింది. కామెంట్లు చాలా సులువని.. ఆడడమే కష్టమని పేర్కొంది. అంతేగాక.. కంగనాతో పోల్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. కంగనా రనౌత్ చాలా అందమైన వ్యక్తి అని.. తాను బ్యాడ్మింటన్ లో స్టార్ అని చెప్పుకొచ్చింది. మరోవైపు మీలాంటివారు నాపై ఇంట్లో కూర్చుని కామెంట్లు చేయడం సులువే.. కానీ, నాలా ఆడడం చాలా కష్టం అని కౌంటర్ ఇచ్చింది. పనిలోపనిగా.. నీరజ్‌ చోప్రా భారత సూపర్ స్టార్ అని.. జావెలిన్‌ త్రో ప్రాచుర్యం రావడంలో కీలక పాత్ర పోషించాడని తనను తాను సమర్థించుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలిచిన సందర్భాన్ని గుర్తుచేసింది. అంతేగాక.. భారత్ కు ఒలింపిక్ పతకం తెచ్చానని చెప్పుకొచ్చింది.

2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత 2016లో విఫలమైంది. క్రమంగా బ్యాడ్మింటన్ కు దూరమైంది. స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో విభేదాలు, గాయాలు సైనా కెరీర్ ను దెబ్బతీశాయి. సొంత రాష్ట్రం హరియాణా అయినా.. హైదరాబాద్ అమ్మాయిగానే సైనా పేరు తెచ్చుకుంది. ఇక్కడే స్థిరపడడంతో హైదరాబాదీగానే గుర్తింపు పొందింది. అయితే, ఒలింపిక్ పతకం తర్వాత మళ్లీ ఆమె మెరుపులు కనిపించలేదు. ఈలోగా అచ్చ తెలుగు అమ్మాయి పీవీ సింధు దూసుకొచ్చింది. సైనా పూర్తిగా తెరమరుగైంది. కొంచెం దూకుడు తత్వం ఉన్న ఆమె తరచూ విమర్శకులకు దొరుకుతోంది.