ద్రవిడ్ లేడు.. లక్ష్మణ్ కాదు.. టీమిండియాకు కొత్త కోచ్.. ఎవరాయన?
By: Tupaki Desk | 13 Aug 2023 9:19 AM GMTటీమిండియా ఇప్పుడు ఒక జట్టు కాదు.. మూడు నాలుగు జట్లు. వెస్టిండీస్ టూర్ కు ఒకటి, ఐర్లాండ్ సిరీస్ కు ఒకటి, ఆసియా కప్ కు ఒకటి.. ఆసియా క్రీడలకు ఒకటి.. అన్నిటికి మించి ప్రపంచ కప్ నకు ఒకటి.. ఇలా అందరు ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ వెళ్తోంది క్రికెట్ బోర్డు. వాస్తవానికి దేశంలో ఆ స్థాయిలో క్రికెట్ ప్రతిభ కూడా ఉంది. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను లెక్కేసినా 50 మంది వరకు ఉంటారు. సరే ఈ విషయాన్ని పక్కనపెడితే ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్ లో మంచి జట్టుగా ఎదుగుతున్న ఐర్లాండ్ తో ఈ నెల 18 నుంచి టి20 సిరీస్ ఆడనుంది.
కెప్టెన్ తో పాటు కోచ్ ఎంపికా అనూహ్యం
వెన్నెముక గాయంతో ఏడాదినుంచి జట్టుకు దూరమయ్యాడు ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. అతడు మరో ఆర్నెల్ల వరకైనా కోలుకోడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా తిరిగి బంతిని పట్టుకున్న కొద్ది రోజుల్లోనే టీమిండియాలోకి వచ్చేశాడు. అంతేకాదు ఏకంగా కెప్టెన్ అయ్యాడు. ఐర్లాండ్ తో టి20లకు అతడే సారథి. ఇది కేవలం టి20 సిరీస్ అయినప్పటికీ టీమిండియాకు చాలా కీలకం. ఎందుకంటే పునరాగమనంలో బుమ్రా ఎలాంటి ప్రదర్శన చేస్తాడో..? యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, తొలిసారి ఎంపికైన రింకూ సింగ్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ ఎలా రాణిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఐర్లాండ్ పర్యటనకు బయల్దేరే ప్రణాళికల్లో ఉన్న టీమిండియాకు ఇప్పుడు హెడ్ కోచ్ గా సిథాన్షు కోటక్ ఎంపికయ్యాడు.
ఎవరీ సిథాన్షు కోటక్???
సిథాన్షు హరగోవింద్ భాయ్ కోటక్.. మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లనున్న టీమిండియా హెడ్ కోచ్. వాస్తవానికి ఈ బాధ్యత రాహుల్ ద్రవిడ్ ది. కానీ, అతడు ఇఫ్పటికే వెస్టిండీస్ టూర్ లో ఉన్నాడు. అంతకుముందు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్ వెళ్లాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ లోనూ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. ఈ పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఐర్లాండ్ టూర్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ లెక్కన ద్రవిడ్ స్థానంలో హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ వెళ్లాలి. కానీ, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) బాధ్యతల్లో అతడు తీరిక లేకుండా ఉన్నాడు. అందుకనే సిథాన్షును పంపుతున్నారు. ఇతడు ప్రస్తుతం ఇండియా- ఏ జట్టుకు, ఎన్సీఏలో హెడ్ కోచ్. కాగా, గుజరాత్ రాజ్ కోట్ కు చెందిన 50 ఏళ్ల సిథాన్షు ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 8061 పరుగులు చేశాడు. 89 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 3,083 పరుగులు చేశాడు. మరోవైపు సిథాన్షుకు సహాయంగా బౌలింగ్ కోచ్ గా స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐర్లాండ్ వెళ్తాడు.
కుర్రాళ్లే కుర్రాళ్లు..
ఐర్లాండ్ తో ఈ నెల 18 నుంచి 23 మధ్య ఐదు మ్యాచ్ లు జరగనున్నాయి. అభిషేక్ శర్మ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రభ్ సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, ఆకాశ్ సింగ్, రాజ్యవర్థన్ హంగర్గేకర్, దివ్యాన్ష్ సక్సేనా తదితర కొత్త ముఖాలకు టీమిండియాలో చోటిచ్చారు. రెండేళ్లుగా ఇండియా ఏ కోచ్ గా ఉన్న సిథాన్షు ఈ సిరీస్ లో కుర్రాళ్లకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తాడో చూడాలి.