టీ-20 వరల్డ్ కప్ -2024... ఆలౌట్లలో సరికొత్త రికార్డ్స్!
అవును.. ప్రస్తుతం జరుగుతున్న టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ - 2024 లో భారీ స్కోర్లు లేవు.
By: Tupaki Desk | 15 Jun 2024 1:36 PM GMTఅమెరికా - వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ - 2024లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి! సాధారణంగా టీ-20 క్రికెట్ మ్యాచ్ లంటే... భారీ స్కోర్లు, రికార్డులు బద్దలు కొట్టే పరుగులు ఉంటాయని అంతా భావిస్తుంటారు! అయితే... ఈ వరల్డ్ కప్ మాత్రం రొటీన్ కు భిన్నంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన రికార్డ్ నెలకొంది.
అవును.. ప్రస్తుతం జరుగుతున్న టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ - 2024 లో భారీ స్కోర్లు లేవు. ఈ టోర్నమెంట్ కంటే ముందు ఐపీఎల్ సీజన్ 17 చూసిన భారీ స్కోర్లు ఏమాత్రం కనిపించడం లేదు. బంతి బౌండరీకి చేరుకోవడం గగనంలా మారిందన్నా అతిశయోక్తి కాదేమో. ఒక్క మాటలో చెప్పాలంటే... ఇక్కడి పిచ్ లు ఇక్కడ బ్యాటర్స్ బెంబేలెత్తిపోతున్న పరిస్థితి!
ఉదాహరణకు తాజాగా శనివారం ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో న్యూజిలాండ్ - ఉగాండా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఉదాహరణ. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ జట్టు 18.4 ఓవర్లలో 40 పరుగులకే ఆలౌటైంది. అంటే... టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్ అన్నమాట.
అనంతరం ఈ అత్యల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 5 ఓవర్లు తీసుకుంది! కాగా... 2014లో ఛటోగ్రాం లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేసిన 39 పరుగులు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ఈ టీ-20 ప్రపంచకప్ - 2024 లో 100 కంటే తక్కువ పరుగులకు ఆలౌట్లు నమోదైన టోర్నీగా రికార్డ్ నెలకొంది.
ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకూ 10 ఇన్నింగ్స్ లలో 100 కంటే తక్కువ పరుగులకే ఆలౌటైన పరిస్థితి. ఈ విషయంలో చిన్న జట్లు, పెద్ద జట్లు అనేతారతమ్యాలేమీ లేవు! వాస్తవానికి 2014, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో 100 లోపు పరుగులు 8 ఇన్నింగ్స్ ల్లో నమోదవ్వగా... 2010 టీ-20 వరల్డ్ కప్ టోర్నీలో 4 ఇన్నింగ్స్ ల్లో 100 కంటే తక్కువ పరుగులకు ఆలౌట్ లు నమోదయ్యాయి.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఈ రికార్డ్ లో భాగస్వామ్యం సంపాదించుకున్న జట్ల వివరాలను చూస్తే... ఐర్లాండ్ (96), పాపువా న్యూ గినియా (77, 95), శ్రీలంక (77), న్యూజిలాండ్ (75), నమీబియా (72), ఉగాండ (58, 40, 39), ఒమన్ (47) లు ఉన్నాయి.
ఇదే క్రమంలో టీ-20 ప్రపంచ కప్ లో అత్యల్ప స్కోర్ చేసిన జట్ల జాబితా ఈ విధంగా ఉంది.
నెదర్లాండ్ (39) వర్సెస్ శ్రీలంక @ ఛటోగ్రాం - 2014
ఉగాండ (39) వర్సెస్ వెస్టిండీస్ @ గయానా - 2024
ఉగాండ (40) వర్సెస్ న్యూజిలాండ్ @ టరూబా - 2024
నెదర్లాండ్ (44) వర్సెస్ శ్రీలంక @ షార్జా - 2021
ఒమన్ (47) వర్సెస్ ఇంగ్లాండ్ @ ఆంటిగ్వా - 2024
వెస్టిండీస్ (55) వర్సెస్ ఇంగ్లండ్ @ దుబాయ్ - 2021
ఆగనిస్తాన్ (58) వర్సెస్ ఉగాండ @ గయానా - 2024