Begin typing your search above and press return to search.

టి20 మహిళ వరల్డ్ కప్ లో అంపైరింగ్ రగడ.. భారత్ ఓటమి?

ఇప్పటివరకు టి20 ప్రపంచకప్ గెలవని భారత మహిళల జట్టు ఎన్నో ఆశలతో తాజాగా మొదలైన ప్రపంచ కప్ లో ప్రయాణం ప్రారంభించింది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 10:55 AM GMT
టి20 మహిళ వరల్డ్ కప్ లో అంపైరింగ్ రగడ.. భారత్ ఓటమి?
X

ఇప్పటివరకు టి20 ప్రపంచకప్ గెలవని భారత మహిళల జట్టు ఎన్నో ఆశలతో తాజాగా మొదలైన ప్రపంచ కప్ లో ప్రయాణం ప్రారంభించింది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్ వంటి సమఉజ్జీతోనే పడింది. అందులోనూ కఠినమైన గ్రూప్ లో ఉన్న భారత్ కు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా కీలకం. కఠినమైన గ్రూప్ అని ఎందుకు అంటున్నాం అంటే.. ఇప్టపివరకు 8 టి20 ప్రపంచ కప్ లు జరగ్గా.. ఆస్ట్రేలియా ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023) నెగ్గింది. ఇంగ్లాండ్‌ (2009), వెస్టిండీస్‌ (2016) ఒక్కోసారి గెలిచాయి. 2020లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన భారత్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. కాగా.. భారత్ ఉన్న గ్రూప్ లోనే ఆస్ట్రేలియా ఉంది. మరో ప్రమాదకర జట్టూ పాకిస్థాన్ కూడా ఇదే గ్రూప్ లో ఉంది.

పురుషుల కప్ కొట్టారు.. మరి మహిళలు..

జూన్ లో జరిగిన పురుషుల టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది. దీంతో అమ్మాయిలు కప్ కొట్టేది ఎప్పుడు అని ప్రశ్న వస్తోంది. మంచి ఆల్ రౌండ్ బలం ఉన్న భారత జట్టుపై అంచనాలూ భారీగానే ఉన్నాయి. అయితే, 10 జట్లు అయిదేసి జట్లుగా విడిపోయి మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి . లీగ్‌ దశలో టాప్‌-2 జట్లు సెమీస్‌ కు వెళ్తాయి. శుక్రవారం.. తొలి మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ను ఎదుర్కొంది. బలాబలాల ప్రకారం చూస్తే భారత్ దే కాస్త పైచేయి. కానీ, పరాజయం పాలైంది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ ఇండియా 102 పరుగులకే కుప్పకూలింది.

ఔటా కాదా..?

భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ లో ఔటైనట్లు భావించిన న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా కెర్ ను వెనక్కు పిలిపించడంపై భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ విమర్శలు వ్యక్తం చేస్తోంది. అమేలియా రనౌట్ సంగతిని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం భారత్‌ కు వ్యతిరేకంగానే వచ్చింది. అయితే, దీనిపై రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. అంపైర్‌ నిర్ణయాలను గౌరవిస్తామని.. కానీ, ఇది మాత్రం అత్యంత దారుణమని వ్యాఖ్యానించింది.

అసలు ఏం జరిగింది?

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్ లో 14వ ఓవర్‌ చివరి బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ వైపు పంపిన అమేలియా పరుగు తీసింది. స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌ బంతి పూర్తయిందన్న ఉద్దేశంతో షూ లేస్‌ కట్టుకుంటూ కనిపించింది. కానీ, బ్యాటర్లు అమేలియా, సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నించారు. హర్మన్‌ నుంచి బంతి అందుకున్న వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ అమేలియాను రనౌట్‌ చేసింది. దీంతో అమేలియా కూడా ఔట్ గా భావించి పెవిలియన్ వైవు వెళ్లసాగింది. కానీ అంపైర్‌ బంతి అప్పటికే డెడ్‌ అయినట్లు ప్రకటించి వెనక్కి పిలిచింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ దీనిపై అంపైర్‌ తో వాదించినా ఫలితం లేకపోయింది. అమేలియా తర్వాతి ఓవర్లోనే ఔటైంది. దీనిపై రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. బౌలర్ దీప్తికి అంపైర్ క్యాప్‌ ఇవ్వడం తాను చూడలేదని.. న్యూజిలాండ్‌ బ్యాటర్లు రెండో రన్‌ కోసం పరుగుపెట్టారని చెప్పింది. అమేలియానే కాదు మేం కూడా ఓవర్‌ పూర్తి కాలేదనే ఉద్దేశంతోనే ఉన్నామని తెలిపింది. కెర్ రనౌట్‌ అయినట్లుగా భావించామంది. అంపైర్‌ నిర్ణయం మాత్రం వేరేగా వచ్చిందని.. అది తమ చేతుల్లో లేదని పేర్కొంది.

ఈ మ్యాచ్ లో కెర్ 22 బంతులాడి 13 పరుగులే చేసింది. కాబట్టి ఆమె క్రీజులో ఉంటేనే భారత్ కు లాభం. కెర్ రనౌట్ కాకపోవడంతో వచ్చిన నష్టమేమీ లేదన్నమాట.