Begin typing your search above and press return to search.

క్రికెట్ లో భారత్ అప్రియమైన ప్రత్యర్థి న్యూజిలాండ్

క్రికెట్ లో న్యూజిలాండ్ జట్టు పైకి ఎలా ఉన్నా అది భారత్ ను కొట్టే దెబ్బ గట్టిగా ఉంటుంది. ఇది పలు సందర్భాల్లో రుజువైంది కూడా.

By:  Tupaki Desk   |   4 Nov 2024 2:30 AM GMT
క్రికెట్ లో భారత్ అప్రియమైన ప్రత్యర్థి న్యూజిలాండ్
X

క్రికెట్ లో భారత్ కు చిరకాల ప్రత్యర్థి అంటే పాకిస్థాన్. కానీ, ప్రియమైన ప్రత్యర్థి అంటే మాత్రం న్యూజిలాండ్ పేరే చెప్పాలేమో..? చాలాసార్లు మన జట్టుకు షాక్ ఇచ్చింది కివీస్. కప్ ఖాయం అనుకున్న ప్రతిసారీ భారత్ కు అడ్డుగోడలా నిలిచింది న్యూజిలాండ్. ఆల్ రౌండ్ ప్రదర్శన.. మెరుపు ఫీల్డింగ్.. ఫలితం ఎలా వచ్చినా స్వీకరించడం.. ఒత్తిడి లేకుండా ఆడడం.. ఇవీ న్యూజిలాండ్ జట్టు ప్రత్యేకతలు. పైగా ఆట పట్ల వారి ఆటిట్యూడ్ వారిని భిన్నంగా నిలుపుతుంది.

దెబ్బ గట్టిదే..

క్రికెట్ లో న్యూజిలాండ్ జట్టు పైకి ఎలా ఉన్నా అది భారత్ ను కొట్టే దెబ్బ గట్టిగా ఉంటుంది. ఇది పలు సందర్భాల్లో రుజువైంది కూడా. ఆ దెబ్బ భారత క్రికెట్ ను చాన్నాళ్లు బాధిస్తుంది. గతం సంగతి వదిలేస్తే..

సరిగ్గా 24 ఏళ్ల కిందట

2000 సంవత్సరం అక్టోబరులో కెన్యాలో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. అద్భుతమైన ఆటతీరుతో భారత్ ఫైనల్ కు చేరింది. అటువైపు న్యూజిలాండ్ ప్రత్యర్థి. దీంతో టైటిల్ మనదే అనుకున్నారు. పైగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 264 పరుగులు చేసింది. అప్పటికి ఇది వన్డేల్లో భారీ స్కోరు కిందే లెక్క. చేజింగ్ లో న్యూజిలాండ్ 132 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో మనదే విజయం అని అనుకున్నారు భారత అభిమానులు. కానీ, ఆల్ రౌండర్లు కెయిన్స్ అజేయ సెంచరీ (102), హారిస్ (46) అడ్డుపడ్డారు. దీంతో మరో రెండు బంతులు ఉండగానే న్యూజిలాండ్ గెలిచేసింది.

సెమీస్ కు ముందు సైంధవుడిలా..

ఇంగ్లండ్ లో జరిగిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ ను మరో దెబ్బకొట్టింది న్యూజిలాండ్. తొలుత బ్యాటింగ్ చేసి 239 పరుగులు చేసింది. వర్షం కారణంగా మరుసటి రోజు జరిగిన మ్యాచ్ లో భారత్ ను 221 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రనౌట్ తో భారత ఆశలు ఆవిరయ్యాయి.

డబ్ల్యూటీసీ చాంపియన్ ఫైనల్లో..

2021 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లోనూ టీమ్ ఇండియాను కివీస్ మరో దెబ్బకొట్టింది. 217 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను ఆలౌట్ చేసింది. ప్రతిగా కివీస్ 249 కొట్టింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను 170కే చుట్టేసింది. 139 పరుగుల టార్గెట్ ను 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అలా తొలి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ను మనకు కాకుండా చేసింది.

మహిళల్లోనూ

సరిగ్గా నెల కిందట జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ లోనూ టీమ్ ఇండియాను న్యూజిలాండ్ ఓడించింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ ఫైనల్ చేరేది. 161 పరుగుల టార్గెట్ తో దిగిన భారత్ ను 102కే ఆలౌట్ చేసింది కివీస్ .

ఇది మామూలు దెబ్బ కాదు..

తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉన్న భారత పురుషుల జట్టుకు దిమ్మతిరిగే షాకిచ్చింది న్యూజిలాండ్. స్వదేశంలో చరిత్రలో ఎన్నడూ చూడనంతటి ఓటమి (3-0)ని చూపించింది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరడం ఇక అత్యంత కష్టం కానుంది. అందుకే న్యూజిలాండ్ ను భారత్ కు అప్రియమైన ప్రత్యర్థిగా చెబుతుంటారు.