షాకింగ్.. న్యూజిలాండ్ పై తొలిసారి టెస్టు సిరీస్ ఓటమి అంచున భారత్?
ఇప్పటివరకు భారత్ లో మూడంటే మూడే టెస్టులు నెగ్గిన ఆ జట్టు ఇప్పుడు మూడు టెస్టుల సిరీస్ ను గెలుచుకునేలా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 25 Oct 2024 8:30 AM GMTమొన్నటికి మొన్న శ్రీలంక టూర్ లో రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయి పరాభవంతో భారత్ లో అడుగుపెట్టిన ఆ జట్టు.. ఇప్పుడు సగర్వంగా తలెత్తుకునేలా ఉంది. ఇప్పటివరకు భారత్ లో మూడంటే మూడే టెస్టులు నెగ్గిన ఆ జట్టు ఇప్పుడు మూడు టెస్టుల సిరీస్ ను గెలుచుకునేలా కనిపిస్తోంది. గత వారం బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియాను ఓడించిన న్యూజిలాండ్.. ఇప్పుడు పుణెలో జరుగుతున్న రెండో టెస్టులోనూ పై చేయి సాధించింది.
గట్టిగా పోరాడకుంటే పరాభవమే..
తొలి రోజు వర్షం కారణంగా రద్దయిన బెంగళూరు టెస్టు మూడున్నర రోజుల్లోనే ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రోహిత్ శర్మ నిర్ణయం బెడిసి కొట్టింది. సొంత గడ్డపై ఎన్నడూ లేని విధంగా భారత జట్టు కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. దీని ప్రభావం రెండో ఇన్నింగ్స్ పై పడింది. 400 పైగా పరుగులు చేసినా.. పరాజయం తప్పలేదు. ఇప్పుడు రెండో టెస్టు విషయానికి వస్తే టాస్ మన వైపు లేదు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కొంచెం ఇబ్బంది పడినా భారత స్పిన్ ను తట్టుకుంటూ 259 పరుగులు చేసింది. అయితే, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 156 పరుగులకే ఆలౌట్ చేసి 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందింది. రెండో ఇన్నింగ్స్ నూ సాధికారికంగా మొదలుపెట్టి ఒక్క వికెట్ కోల్పోయి
50పైగా పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ఆధిక్యం 150 దాటింది. విల్ యంగ్, రచిన్ రవీంద్ర వంటి ఫామ్ లో ఉన్న బ్యాటర్లు సహా ఇంకా వికెట్లు చేతిలో ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఆధిక్యం 250 దాటేలా కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ గట్టి పోరాడాల్సిందే. లేదంటే ఓటమి తప్పదు.
కుప్పకూలారు..
న్యూజిలాండ్ స్పిన్నర్లు ఏమంత మేటి కాకున్నా.. భారత బ్యాట్స్ మెన్ వారికి తలొంచారు. ముఖ్యంగా ఎడమ చేతి వాటం స్పిన్నర్ శాంట్నర్ ఏడు వికెట్లు తీశాడు. స్టార్ బ్యాట్స్ మన్ కోహ్లి (1) మళ్లీ విఫలమయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (11) అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. గిల్ (30), జైశ్వాల్ (30) కాస్త పోరాడగా, జడేజా (38) మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ కాస్త మెరుగైన స్కోరు చేయగలిగింది. స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (18 నాటౌట్) దూకుడు చూపినా.. బుమ్రా ఔట్ కావడంతో భారత్ ఆలౌటైంది. న్యూజిలాండ్ 103 పరుగులు ఆధిక్యం దక్కింది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీశాడు.
ఆధిక్యం 200 దాటినా కష్టమే..
న్యూజిలాండ్ ఇప్పటికే 150 పరుగుల ఆధిక్యం దాటింది. ఇది 200 పరుగులు దాటితే నాలుగో ఇన్నింగ్స్ లో భారత్ ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే. లేదా డ్రా కోసం ప్రయత్నించాలి. ఇంకా మూడు రోజుల ఆట ఉండగా.. వికెట్ స్పిన్ కు విపరీతంగా అనుకూలిస్తుండగా డ్రా చేయడం అసాధ్యం. అంటే.. టీమ్ ఇండియా ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉంది.
మొన్న బెంగళూరు టెస్టు గెలుపుతో భారత జట్టుపై 36 ఏళ్ల తర్వాత టెస్టు నెగ్గింది న్యూజిలాండ్. చివరగా 1988లో 136 పరుగుల తేడాతో ఆ జట్టు ఇక్కడ విజయం సాధించింది. భారత్ లో భారత్ పై 1969లో తొలిసారిగా 167 పరుగుల తేడాతో న్యూజిలాండ్ నెగ్గింది. ఇవి రెండూ టెస్టు విజయాలే. ఇప్పుడు ఏకంగా సిరీస్ నే గెలుచుకునేలా ఉంది.