Begin typing your search above and press return to search.

మా అబ్బాయి విలియమ్సన్.. మా ఆయన బౌల్ట్.. నా మనవడు నీషమ్.. వినూత్నంగా కివీస్ జట్టు ప్రకటన

వన్డే ప్రపంచ కప్ సరిగ్గా 22 రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ తొలిసారి పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న టోర్నీ కావడంతో ప్రత్యేకత నెలకొంది

By:  Tupaki Desk   |   12 Sep 2023 10:04 AM GMT
మా అబ్బాయి విలియమ్సన్.. మా ఆయన బౌల్ట్.. నా మనవడు నీషమ్.. వినూత్నంగా కివీస్ జట్టు ప్రకటన
X

వన్డే ప్రపంచ కప్ సరిగ్గా 22 రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ తొలిసారి పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న టోర్నీ కావడంతో ప్రత్యేకత నెలకొంది. దీనికితోడు గత ప్రపంచ కప్ (2011)లో భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లలో కోహ్లి వంటి ఒకరిద్దరు తప్ప అందరూ రిటైరై పోయి ఉంటారు. కాగా, టోర్నీకి 15 మంది జట్టు సభ్యులను ప్రకటించేందుకు గడువు ఈ నెల 5తోనే ముగిసింది. మిగిలిన ఏమైనా మార్పు చేర్పులకు ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం ఉంది.

కేన్ మామ వచ్చాడు..

ప్రపంచ కప్ లో అత్యంత నిలకడైన జట్టు ఏదంటే కచ్చితంగా చెప్పాల్సిన పేరు న్యూజిలాండ్. గత కప్ లో ఆ జట్టు ఫైనల్లో అద్భుత పోరాటం సాగించింది. బ్యాడ్ లక్ కొద్దీ ఫోర్ల సంఖ్యలో తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ సమష్టిగా ఆడే జట్టు. కనీసం సెమీస్ వరకు చేరుకోగల సత్తా దీని సొంతం. ఇప్పటికే పలు టోర్నీల్లో ఆ జట్టు సెమీస్ వరకు వచ్చింది కూడా. మరోవైపు ఈసారి కూడా న్యూజిలాండ్ సెమీస్ చేరుతుందనే అంచనాలు. అన్నిటికి మించి ఐపీఎల్ సందర్భంగా గాయపడిన కెప్టెన్ విలియమ్సన్ మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. దాదాపు ఐదు నెలలు క్రికెట్ కు దూరంగా ఉన్న అతడు కాస్త సమస్యలున్నా పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. దీంతో నేరుగా ప్రపంచ కప్ బరిలోకి దించుతున్నారు. కేన్ మామగా భారత అభిమానులు ముఖ్యంగా హైదరాబాదీలు ఎంతో ముద్దుగా పిలుచుకునే విలియమ్సన్ బ్యాటింగ్ క్లాస్ ను మనం చూసే భాగ్యం కలగనుది.

వెరైటీగా జట్టు సభ్యుల పరిచయం

ప్రపంచ కప్ నకు ఎంపికైన జట్టు సభ్యులను న్యూజిలాండ్ బోర్డు వినూత్నంగా పరిచయం చేసింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులే వారి పేర్లను సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ''మా 2023 ప్రపంచకప్‌ జట్టు సభ్యులను వారి నంబర్‌వన్‌ ఫ్యాన్సే పరిచయం చేస్తారు'' అన్న వ్యాఖ్యతో న్యూజిలాండ్‌ క్రికెట్‌.. ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. విలియమ్సన్‌ కుటుంబం, ట్రెంట్‌ బౌల్ట్‌ కుమారులు, రచిన్‌ రవీంద్ర తల్లిదండ్రులు, జిమ్మీ నీషమ్‌ నానమ్మ.. తమ వాళ్లకు వారి జెర్సీ నంబర్లతో శుభాకాంక్షలు చెప్పడం వీడియోలో చూడొచ్చు. ప్రతి ఆటగాడి గురించి వారి కుటుంబ సభ్యులు చెప్పారు.