టీమిండియా నుంచి ముప్పు: న్యూజిలాండ్ స్టార్ కీలక వ్యాఖ్యలు!
భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు ముగిసిపోయాయి.
By: Tupaki Desk | 14 Nov 2023 5:21 AM GMTభారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు ముగిసిపోయాయి. ఇక రెండు సెమీ ఫైనల్ మ్యాచులు, ఒక ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.
లీగ్ దశలో టీమిండియా వరుసగా తొమ్మిది మ్యాచ్ లు గెలిచి రికార్డు సృష్టించింది. తద్వారా ఈ వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో టాప్ లో నిలిచింది.
టీమిండియా సెమీస్ లో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ తో తలపడనుంది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 2011లో టీమిండియా ఇదే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పై గెలుపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
టీమిండియాలో ఓవైపు బ్యాటర్లు, ఇంకోవైపు బౌలర్లు ఇలా ఎవరికి వారు తమదైన శైలితో చెలరేగుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు ఓపెనర్ డేవాన్ కాన్వే కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ భారత్ బలమైన జట్టని పేర్కొన్నాడు. ఆ టీమ్ నుంచి ఎదురయ్యే సవాల్ ను అధిగమించేందుకు తమ జట్టు సీనియర్ ఆటగాళ్లపై ఆధారపడిందని వెల్లడించాడు.
భారత్ ఎలా ఆడుతుందో మనందరికీ తెలుసని డేవాన్ కాన్వే వ్యాఖ్యానించాడు. టీమ్ ఇండియా మంచి ఊపుమీదుందని గుర్తు చేశాడు. భారత్ కు బలమైన జట్టు ఉందన్నాడు. సెమీఫైనల్ లో ఆతిథ్య దేశంతో ఆడుతుండటం పట్ల తమకు ఉత్సాహంగా ఉందని తెలిపాడు. టీమ్ ఇండియా నుంచి ముప్పు ఉందని.. అయితే ఆ సవాల్ కోసం తాము ఎదురు చూస్తున్నామని వెల్లడించాడు.
ఇది తమకు మరో ప్రత్యేక సందర్భమని తెలుసనని కాన్వే వ్యాఖ్యానించాడు. తమ జట్టులో ఉన్న చాలామందికి ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉందని తెలిపాడు. ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకోవడం తమ జట్టు లక్ష్యాలలో ఒకటి అని కాన్వే పేర్కొన్నాడు. ఆ లక్ష్యానికి తాము ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నామన్నాడు. ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని.. తమ లక్ష్యం కోసం మేం చేయాల్సింది చేస్తామని పేర్కొన్నాడు.