Begin typing your search above and press return to search.

సచిన్ తర్వాత.. చరిత్ర రచిస్తున్న రచినుడు పక్కా "కివీ"నట

దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్.. ప్రస్తుత ప్రపంచ కప్ లో భారతీయ మూలాలున్న ఆటగాళ్లతో కూడిన జట్లు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 9:08 AM GMT
సచిన్ తర్వాత.. చరిత్ర రచిస్తున్న రచినుడు పక్కా కివీనట
X

దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్.. ప్రస్తుత ప్రపంచ కప్ లో భారతీయ మూలాలున్న ఆటగాళ్లతో కూడిన జట్లు. ఇందులో మరీ ముఖ్యంగా కివీస్ జట్టు ఆటగాడు రచిన్ రవీంద్ర గురించి చెప్పాలి. సాధారణ స్పిన్ ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన అతడు ఓపెనర్ గా, వన్ డౌన్ బ్యాట్స్ మన్ గా సెంచరీలు, అర్ధ సెంచరీలు బాది ఔరా అనిపిస్తున్నాడు. న్యూజిలాండ్ జట్టులో మరే ప్రధాన బ్యాట్స్ మన్ కూ సాధ్యం కాని విధంగా నిలకడగా ఆడుతున్నాడు. పోలిక సరికాదు కానీ.. న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ కంటే రచిన్ మెరుగ్గా ఆడుతున్నాడు. ఇప్పడు అతడు అరుదైన ఘనత సాధించాడు.

రాహుల్ + సచిన్ = రచిన్

రచిన్ రవీంద్ర.. ఇందులో రవీంద్ర అంటే తండ్రి పేరు అనుకుందాం..? రచిన్ ఏమిటి? భారతీయ పేర్లలో దీనికి అర్థమేమిటి? అని వెదికేవారు బోలెడు మంది ఉంటారు. ఈ పేరు వెనుక గొప్ప అర్థం ఉందో లేదో తెలియకున్నా, పరమార్థం మాత్రం చాలా ఉంది. భారత క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి పెట్టిందే ‘రచిన్’ అనే పేరు. బెంగళూరుకు చెందిన రచిన్ తండ్రి రవీంద్ర.. సచిన్, రాహుల్ ద్రవిడ్ లకు పెద్ద ఫ్యాన్. న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడినప్పటికీ, భారతీయ మూలాలను మరువని అతడు తన కుమారుడికి ఆరాధ్య క్రికెటర్ల పేర్లు పెట్టుకున్నాడు.

రెండు సెంచరీలు.. రెండు అర్థ సెంచరీలు

భారత్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో 400 పైగా పరగులు చేసిన విదేశీ బ్యాట్స్ మెన్ ముగ్గురు నలుగురే. వారిలో డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), తర్వాత నిలుస్తున్నాడు రచిన్ రవీంద్ర. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన అతడు రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. దీన్నిబట్టే రచిన్ ఫామ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. మరోవైపు శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అత్యద్భుతం అనదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. 389 పరుగుల టార్గెట్ దగ్గరకు చేరేందుకు 116 పరుగుల ఆ ఇన్నింగ్స్ ఎంతగానో ఉపయోగపడింది. రచిన్ కొట్టిన ఐదు భారీ సిక్స్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరు మ్యాచ్ లలో 406 పరుగులు చేసిన రచిన్ ఓ అరుదైన రికార్డును అధిగమించాడు. అదికూడా తన పేరులోని సచిన్ పేరిట ఉన్న రికార్డు కావడం విశేషం. 23 ఏళ్ల వయసులో ఐసీపీ ప్రపంచ కప్ టోర్నీలో 400 పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా రచిన్ నిలిచాడు. గతంలో సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది. కాగా, రచిన్ కు ఇదే తొలి ప్రపంచ కప్.

పక్కా కివీని.. భారతీయ మూలాలు గర్వకారణం

తాను పక్కాగా న్యూజిలాండర్ ను అని చెబుతున్నాడు రచిన్ రవీంద్ర. అయితే, ఇండియన్ మూలాల పట్ల గర్వంగా ఫీలవుతుంటానని చెబుతున్నాడు. అంతేకాదు.. భారత్‌ లో ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుందా? అని తనను చాలాసార్లు అడిగారని.. తాను మళ్లీమళ్లీ చెబుతున్నానని అన్నాడు. భారత్ తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన దేశమని.. కుటుంబ సభ్యులూ ఉన్న విషయాన్ని గుర్తుచేశాడు. ఇక్కడి పిచ్‌ లు బ్యాటింగ్‌ కు అనుకూలమని.. గతంలో రాణించలేదని, దాంతో మెరుగుపడేందుకు తీవ్రంగా ప్రయత్నించానని చెప్పాడు. ఇప్పుడది ఉపయోగకరంగా మారిందని పేర్కొంటున్నాడు. ఇక సెంచరీ కొట్టిన ధర్మశాల మైదానం గురించి మాట్లాడుతూ.. అభిమానుల మద్దతు అద్భుతమని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఆడినా అభిమానులు ఉత్సాహపరుస్తున్న తీరు బాగుందన్నాడు.