అప్పుడు వారు.. నేడు వీరు.. 2019 నాటి కివీస్, భారత్ కు తేడాలివి
మళ్లీ ఇప్పుడు బుధవారం ముంబైలో ప్రపంచ కప్ తొలి సెమీస్ రెండు జట్లూ పోటీ పడుతున్నాయి.
By: Tupaki Desk | 15 Nov 2023 3:00 AM GMT2019లో ఇలాగే.. ప్రపంచ కప్ లో టీమిండియా పాయింట్ల టేబుల్ టాపర్.. న్యూజిలాండ్ ది నాలుగో స్థానం. అప్పట్లో భారత్ అప్రతిహతంగా సాగిపోయింది.. ఒక్క ఇంగ్లండ్ చేతిలోనే ఓడింది. న్యూజిలాండ్ మాత్రం 9 మ్యాచ్ లలో ఐదే గెలిచి మూడు ఓడింది. టాపర్ భారత్, నాలుగో నంబరులోని న్యూజిలాండ్ తలపడితే.. టాపర్ దే విజయం అని అందరూ భావిస్తారు. అభిమానులు, విశ్లేషకులు ఇదే అనుకున్నారు. కానీ, ఏం జరిగింది? టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మళ్లీ ఇప్పుడు బుధవారం ముంబైలో ప్రపంచ కప్ తొలి సెమీస్ రెండు జట్లూ పోటీ పడుతున్నాయి. మరి నాడు ఇరు జట్లలో ఉన్నదెవరు? నేడు ఉన్నదెవరు? చూద్దామా?
ధోనీ, కార్తీక్, పంత్, హార్దిక్, భువీ మిస్
2019 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా తుది జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్లు ధోనీ, మహేంద్ర సింగ్ ధోనీ, రిషభ్ పంత్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ భువనేశ్వర్ ప్రస్తుత జట్టులో లేరు. ఈ ఐదుగురిలో ధోనీ, పంత్, కార్తీక్ ముగ్గురూ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్లు కావడం గమనార్హం. పంత్ ఘోర రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమయ్యాడు. భువనేశ్వర్ ఫామ్ కోల్పోయి రెండేళ్ల కిందట నుంచి టీమిండియాలోకి రావడం లేదు. హార్దిక్ ఈ ప్రపంచ కప్ లో నాలుగో మ్యాచ్ సందర్భంగా గాయపడి వైదొలగాడు. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ నాటి జట్టులో సభ్యుడు. కానీ, ఈసారి ప్రపంచ కప్ నకే ఎంపిక కాలేదు. అంటే.. నాలుగేళ్ల కిందటి జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఇప్పుడు లేరు.
కివీస్ తరఫున ఇలా..
గత కప్ నకు ఇప్పటికి చూస్తే.. భారత్ కంటే న్యూజిలాండ్ జట్టులోనే ఎక్కువ మార్పులు జరిగాయి. అప్పట్లో ఓపెనర్లుగా వచ్చిన మార్టిన్ గప్టిల్, నికోల్స్ ప్రస్తుత జట్టులో లేరు. గత ప్రపంచ కప్ సెమీస్ లో 74 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన రాస్ టేలర్ రిటైరయ్యాడు. ఆల్ రౌండర్ గ్రాండ్ హోమ్ ను ఈసారి ఎంపిక చేయలేదు. నీషమ్ ఒకటీ రెండు మ్యాచ్ లు ఆడినా.. విఫలం కావడంతో మళ్లీ తుది జట్టులోకి పరిగణింలేదు. అన్నిటికి మించి నాలుగేళ్ల కిందటి సెమీఫైనల్లో టీమిండియాను దెబ్బకొట్టిన పేసర్ మ్యాట్ హెన్రీ ఈసారి కప్ లో లేడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. మొత్తమ్మీద అప్పటి జట్టులోని విలియమ్సన్, బౌల్ట్, శాంటర్న్, లాథమ్ మాత్రమే ఇప్పటికీ ఉన్నారు. భారత్ కు ఆరుగురు ఆటగాళ్లు దూరమైతే కివీస్ కు ఏడుగురు అన్నమాట.
బలం పెరిగిందా? తరిగిందా?
నాలుగేళ్ల కిందటితో పోలిస్తే భారత్ బలమే బాగా పెరిగింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్ రూపంలో అద్భుత బ్యాట్స్ మన్ దొరికాడు. అయితే, కివీస్ కూ రచిన్ రవీంద్ర లభించాడు. రోహిత్ అప్పటిలాగానే ఇప్పుడూ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కోహ్లి ఇంకా బాగా ఆడుతున్నాడు. న్యూజిలాండ్ కు మాత్రం కెప్టెన్ విలియమ్సన్ గాయం పెద్ద ఆందోళనగా మారింది. కేఎల్ రాహుల్ 2019లో ఓపెనర్ గా రాగా, నేడు మిడిలార్డర్ లో దిగుతూ దుమ్మురేపుతున్నాడు. అప్పట్లో జట్టులో లేని శ్రేయస్ అయ్యర్ ఈసారి కీలక ఆటగాడు. అయితే, న్యూజిలాండ్ కు కూడా డారెల్ మిషెల్, గ్లెన్ ఫిలిఫ్స్, మార్క్ చాప్ మన్ వంటి వారు లభించారు. ఇక బౌలింగ్ లో భారత్ తరఫున పేసర్లు హైదరాబాదీ సిరాజ్, సీనియర్ షమీ అప్పటి జట్టులో లేరు. ఇప్పుడు వీరు అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లు. కివీస్ కు బౌల్ట్ ఉన్నా హెన్రీ దూరమయ్యాడు. స్పిన్నర్లలో వారికి శాంట్నర్ ఉంటే మనకు జడేజా ఉన్నాడు. ఈ విభాగంలో తేడా ఏమంటే కుల్దీప్ యాదవ్. గత ప్రపంచ కప్ మిస్సయిన అతడు ఈసారి చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. వెరసి.. 2019కి ఇప్పటికి భారత్ బాగా బలంగా ఎదిగితే.. కివీస్ దీటుగా నిలుస్తోంది. ఇద్దరిలో విజేత ఎవరో బుధవారం చూద్దాం.