Begin typing your search above and press return to search.

నిశేష్ బసవారెడ్డి..టెన్నిస్ గ్రేట్ జకోను ఓడించిన అమెరికన్ తెలుగోడు

టెన్నిస్ లో భారత ఆటగాడు ఇంతవరకు సింగిల్స్ గ్రాండ్ స్లామ్ గెలిచింది లేదు. కనీసం సెమీ ఫైనల్స్ కు చేరినా గొప్పే అనే పరిస్థితి.

By:  Tupaki Desk   |   14 Jan 2025 6:30 PM GMT
నిశేష్ బసవారెడ్డి..టెన్నిస్ గ్రేట్ జకోను ఓడించిన అమెరికన్ తెలుగోడు
X

టెన్నిస్ లో భారత ఆటగాడు ఇంతవరకు సింగిల్స్ గ్రాండ్ స్లామ్ గెలిచింది లేదు. కనీసం సెమీ ఫైనల్స్ కు చేరినా గొప్పే అనే పరిస్థితి. మరోవైపు మనదేశంలో పదో వంతు కూడా ఉండని సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ లు చరిత్రలోకెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి భారతీయుడు మరెప్పుడు గ్రాండ్ స్లామ్ కొడతాడు..? అనే ప్రశ్న ఎంతకాలంగానో వేధిస్తోంది. దీనికి తెరదించుతూ సమీప భవిష్యత్ లో ఓ ‘భారతీయుడు’ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ కొరత తీర్చబోతున్నాడు.

నిశేష్ బసవారెడ్డి.. పురుషుల టెన్నిస్ లో ఈ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలోనే అతడు 24 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన జకోవిచ్ తో తలపడ్డాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ లో వీరిద్దరి మధ్య జరిగి మ్యాచ్ లో జకోవిచ్ 4-6, 6-3, 6-4, 6-2తో గెలిచాడు. ఇక్కడ తొలి సెట్ ను చూస్తే నిశేష్ 6-4 తేడాతో విజయం సాధించాడు. ఇదే ఊపును చూస్తే నిశేష్ అత్యంత సంచలనం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ, పదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌ అయిన జకోవిచ్‌ పుంజుకొని వరుసగా మూడు సెట్లలో గెలిచాడు. జకో కోరుకున్న స్థాయిలో ప్రదర్శన చేయకుండా అడ్డుకోవడంలో నిశేష్ విజయవంతం అయ్యాడు.

ఎవరీ నిశేష్..??

మ్యాచ్ అనంతరం నిశేష్ గురించి మాట్లాడుతూ జకోవిచ్.. అతడికి మంచి భవిష్యత్ ఉందని కొనియాడాడు. కాగా, మ్యాచ్ లో నిశేష్ 8 డబుల్‌ ఫాల్ట్‌ లు, 42 అనవసర తప్పిదాలు చేశాడు. దీంతో ఓడిపోవాల్సి వచ్చింది. కాగా, ఎంతకూ ఎవరీ నిశేష్ అంటే ఏపీలోని నెల్లూరుకు చెందిన మురళీకృష్ణారెడ్డి, సాయి ప్రసన్నల కుమారుడు. ఈ దంపతులు 1999లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. నిశేష్ 2005 మే 2న కాలిఫోర్నియాలో జన్మించాడు. 2022లో యూఎస్ ఓపెన్ బాయ్స్ డబుల్స్ ఓపెన్ టైటిల్ గెలవడం ద్వారా వెలుగులోకి వచ్చాడు.

కాగా, పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్ లో నిశేష్ ప్రస్తుతం 107వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ అతడికి తొలి గ్రాండ్ స్లామ్ కావడం గమనార్హం. ఇదే జోరు కొనసాగిస్తే నిశేష్ ప్రపంచ ర్యాంకుల్లో దూసుకెళ్లడం ఖాయం.

కొసమెరపు: నిశేష్ తో జరిగిన మ్యాచ్ లో జకోవిచ్ కోచ్ గా ఉన్నది బ్రిటన్ కు చెందిన ఆండీ ముర్రే. వీరిద్దరూ 20 ఏళ్లపాటు ప్రత్యర్థులుగా కొనసాగారు. ముర్రే రిటైర్ అయ్యాక కోచ్ గా మారాడు. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ తోనే కోచ్ గా కెరీర్ మొదలుపెట్టాడు.