తెలుగు కుర్రాడు.. టీమ్ ఇండియా టెస్టు గడప తొక్కాడు.. ఇదే స్పెషల్
బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కు ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో నితీశ్ కు చోటు దక్కింది.
By: Tupaki Desk | 26 Oct 2024 1:30 PM GMTఆడింది ఒక్క ఐపీఎల్ సీజన్ మాత్రమే.. కానీ అదరగొట్టాడు.. ఆడింది ఒక్క అంతర్జాతీయ టి20 సిరీస్ మాత్రమే.. కానీ, దుమ్మురేపాడు.. దీంతోనే టీమ్ ఇండియా టెస్టు గడప తొక్కనున్నాడు. అంతా అనుకూలంగా జరిగితే మరొక్క నెలలో టెస్టు జట్ సభ్యుడు కానున్నాడు.. ఇదీ తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సక్సెస్ స్టోరీ. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కు ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో నితీశ్ కు చోటు దక్కింది.
అటు పేస్.. ఇటు బ్యాటింగ్
బంగ్లాతో టి20 సిరీస్ లో నితీశ్ ఏకంగా సెంచరీ కొట్టాడు. సిక్స్ లతో చెలరేగిన అతడు టి20ల్లో స్థానం సుస్థిరం చేసుకున్నాడనే అనుకోవాలి. అయితే, నితీశ్ 135 కిలోమీటర్ల వేగంతో బంతులేయగల పేసర్ కూడా. భారత జట్టుకు ఇప్పుడు కావాల్సింది ఇలాంటి ఆటగాడే. మరీ ముఖ్యంగా టెస్టుల్లో. పేస్ ఆల్ రౌండర్ గా రాణించే హార్దిక్ పాండ్యా టెస్టులు ఆడే పరిస్థితిలో లేడు. దీంతోనే నితీశ్ వైపు మొగ్గు చూపారు సెలక్టర్లు. అందులోనూ ఆస్ట్రేలియా పిచ్ లు పేస్ కు అనుకూలం. భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ వీరెవరికీ సాధికారికంగా బ్యాటింగ్ చేయగల సత్తా లేదు. గతంలో శార్దూల్ ఠాకూర్ కు అవకాశాలు ఇచ్చినా అతడి బౌలింగ్ సాధారణమే. దీంతో టీమ్ మేనేజ్ మెంట్ నితీశ్ కుమార్ రెడ్డిపై నమ్మకం ఉంచింది. అయితే, నితీశ్ కు మంచి టాలెంట్ ఉందని.. పేస్ వేయగలడని.. నాణ్యమైన బ్యాటర్ అని కుంబ్లే కొనియాడాడు. కనీసం 15 ఓవర్లు బౌలింగ్, 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్ కోసం నితీశ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పెద్దగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే.. గణాంకాలు గొప్పగా ఏమీ లేకున్నా నితీశ్ టెస్టు సిరీస్ లో ఆడే అవకాశం ముంగిట ఉండడం గొప్పనే.
నితీశ్ 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ లు ఆడి 708 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 55 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లోకి ఇటీవలే అడుగుపెట్టిన నితీశ్ 90 పరుగులు చేసి.. మూడు వికెట్లు తీశాడు.
తెలుగు నేల నుంచి తొలిసారి
తెలుగు రాష్ట్రాల నుంచి అజహరుద్దీన్, లక్ష్మణ్, రాయుడు, విహారి, సిరాజ్, వెంకటపతిరాజు తదితరులు టీమ్ ఇండియాకు ఆడారు. వీరిలో రాయుడు టెస్టులు ఆడలేదు. అయితే, వీరంతా బౌలర్లు లేదా బ్యాట్స్ మన్లు. నితీశ్ కుమార్ మాత్రం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. టీమ్ ఇండియాకు ఎంపికైన తెలుగోళ్లలో ఎవరికీ దక్కని మరో ప్రత్యేకత ఇది.