మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియా టెస్టు జట్టులో అచ్చ తెలుగోడు?
టీమ్ ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది. కంగారూ జట్టుతో అత్యంత కఠినమైన ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
By: Tupaki Desk | 18 Nov 2024 12:48 PM GMTటీమ్ ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది. కంగారూ జట్టుతో అత్యంత కఠినమైన ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. సహజంగానే ఆసీస్ పర్యటన అంటే చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఫామ్ లో లేని నేపథ్యంలో మరింత కఠినమైన సిరీస్ అని చెప్పక తప్పదు. పైగా 34 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడుతోంది టీమ్ ఇండియా. దీనికి శారీరకంగానే కాదు మానసికంగానూ బలంగా ఉండాల్సి ఉంటుంది.
అతడి వారసుడు ఇతడే..
‘పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్’ ఈ పదం వినేందుకే చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా భారత్ లో. ఒక కపిల్ దేవ్ లాంటి దిగ్గజ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం మూడున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది దేశం. ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా వంటి వారు ఆశలు రేపినా ఆ తర్వాత అంచనాలను అందుకోలేదు. హార్దిక్ ను గాయాలు వెంటాడడం దెబ్బతీసింది. ఇర్ఫాన్ బౌలింగ్ లయ తప్పడం కెరీర్ ను వెనక్కునెట్టింది. మరి టీమ్ ఇండియాకు టెస్టుల్లో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కొరత తీరేదెలా? కపిల్ దేవ్ వారసులుగా పేరు తెచ్చుకోవడమే గానీ పేరు నిలిపేవారే లేరా?
తెలుగోడి తెగువ..
ఒకే ఒక ఐపీఎల్ సీజన్ తో టీమ్ ఇండియలోకి దూసుకొచ్చాడు విశాఖపట్నంకు చెందిన కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. అంతేగాక గత నెలలో బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సిరీస్ లో ఆకట్టుకున్నాడు. బ్యాట్ తో సిక్సర్లు బాదడమే కాదు.. నిలకడగా 135 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలగడం నితీశ్ ప్రత్యేకత. దీంతోనే అతడిని టీమ్ ఇండియా టెస్టు జట్టులోకి తీసుకున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.
టెస్టు ఆడడం ఖాయమే..
నితీశ్ కుమార్ రెడ్డిని ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో టెస్టులో ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో పేసర్ గా అతడి సేవలను ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైనందున.. బ్యాటింగ్ ఆర్డర్ లోతు పెంచాల్సిన అవసరం ఉంది. దీంతోనే నితీశ్ బ్యాటింగ్ కూడా అదనపు బలంగా భావిస్తోంది. కాగా, నితీశ్ గనుక టెస్టు అరంగేట్రం చేస్తే.. మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియాకు ఆడిన అచ్చ తెలుగోడు అవుతాడు. చివరగా హనుమ విహారి భారత జట్టుకు ఆడాడు.
తెలుగు రాష్ట్రాల నుంచి టీమ్ ఇండియాలో పేసర్ సిరాజ్ ఉన్నప్పటికీ అతడు పక్కా హైదరాబాదీ. అచ్చ తెలుగువాడిగా చెప్పలేం.