Begin typing your search above and press return to search.

ఓరి నితీ‘షో’..నక్క తోక తొక్కావ్ పో..తెలుగు యువ క్రికెటర్ మహా లక్కు

వలం 21 ఏళ్లున్న ఈ కుర్రాడు బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టి20లో ఎలాంటి బాదుడు బాదాడో అందరూ చూశారు. ఏడు సిక్సర్లతో విధ్వంసాన్ని రుచి చూపించాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 9:30 PM GMT
ఓరి నితీ‘షో’..నక్క తోక తొక్కావ్ పో..తెలుగు యువ క్రికెటర్ మహా లక్కు
X

ఆడింది ఒకే ఒక్క ఐపీల్ సీజన్.. కానీ అదరగొట్టాడు.. ఆడుతున్నది రెండో అంతర్జాతీయ మ్యాచే.. కానీ దుమ్మరేపాడు.. టి20ల్లో బంతిని ఎలా కొట్టాలో చూపుతూ.. ఇన్నింగ్స్ గేర్ ఎలా మార్చాలో చెబుతూ.. చెలరేగిపోయాడు. ఇదంతా తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి గురించి. కేవలం 21 ఏళ్లున్న ఈ కుర్రాడు బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టి20లో ఎలాంటి బాదుడు బాదాడో అందరూ చూశారు. ఏడు సిక్సర్లతో విధ్వంసాన్ని రుచి చూపించాడు.

ఏమాత్రం బెరుకు లేకుండా కళ్లు చెదిరే షాట్లతో బౌలర్లను బెంబేలెత్చించాడు. అటు అభిమానులను ఉర్రూతలూగించాడు. కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నా.. బాదుడు మొదలెట్టాక తగ్గలేదు. అన్నీ చక్కటి క్రికెటింగ్‌ షాట్లే. అన్నీరకరకాల షాట్లే.

లక్ అంటే ఇదే..

నితీశ్ కుమార్ రెడ్డి 2024 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున మంచి ప్రదర్శన చేశాడు. దీంతో ఆ వెంటనే జింబాబ్వే టూర్ కు ఎంపిక చేశారు. కానీ, గాయం కారణంగా ఆడలేకపోయాడు. అలా అప్పుడు మిస్ అయిన లక్.. ఇప్పుడు తన్నుకుంటూ వచ్చింది. బంగ్లాదేశ్ తో మూడు టి20ల సిరీస్ కు ప్రకటించిన జట్టులో నితీశ్ ఉన్నాడు. కానీ.. కూర్పు కారణంగా తుది జట్టులో ఆడించడం కష్టమే అయింది. ఇంతలో అనుకోని విధంగా ఆల్ రౌండర్ శివమ్ దూబె గాయపడ్డాడు. అతడి స్థానంలో మరో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు చోటు దక్కినా.. అతడు జట్టుతో చేరేసరికి టైం పట్టింది. ఈ నేపథ్యంలోనే తొలి టి20లో నితీశ్ కు తుది జట్టులో చోటు దొరికింది. ఆ మ్యాచ్ లో మెరుగ్గా ఆడడంతో రెండో మ్యాచ్ లోనూ అవకాశం ఇచ్చారు.

తిలక్ కు ఆడిద్దామని..

రెండో టి20లో నితీశ్ స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తారని అందరూ భావించారు. జట్టు మేనేజ్ మెంట్ విన్నింగ్ ఎలెవెన్ ను మార్చకూడదని భావించిందో ఏమో..? నితీశ్ కు మరో అవకాశం ఇచ్చింది. దీనిని అతడు రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. నమ్మకాన్ని నిలబెట్టాడు. కాగా, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ నితీశ్ ను అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపింది టీమ్ మేనేజ్ మెంట్. అతడు దీనికి సంపూర్ణ న్యాయం చేశాడు. జట్టులో గొప్ప బ్యాటర్ ఆడే స్థానంలో బ్యాటింగ్ దిగినా ఒత్తిడికి గురికాలేదు.

ఇక నితీశ్ బ్యాటింగ్ పై ఎంత చెప్పినా తక్కువే. బంగ్లా సీనియర్ ఆటగాడు మహ్మదుల్లా బౌలింగ్ లో లాంగాన్‌లో సిక్స్‌ కు లాఫ్ట్‌, స్పిన్నర్‌ రిషాద్‌ బౌలింగ్‌ లో లాంగాఫ్‌ లోకి మరో లాఫ్ట్‌, తర్వాత స్లాగ్‌ స్వీప్‌ తో లాంగాన్‌ లోకే సిక్స్.. పేసర్‌ ముస్తాఫిజుర్‌ ఆఫ్‌ కటర్‌ ఫ్లాట్‌ సిక్స్‌ ఇలా చెలరేగిపోయాడు.

మరో హార్దిక్ పాండ్యా..

టీమ్ ఇండియాకు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ల కొరత ఉంది. శివమ్ దూబె వంటి వారున్నా అతడి బౌలింగ్ లో పేస్ ఉండరు. 125 కిలోమీటర్లకు మించి వేగం కష్టమే. హార్దిక్ పాండ్యా మాత్రం 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేయగలడు. కానీ, హార్దిక్ కు గాయాల బెడద ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్ కాబోయే సూపర్ స్టార్ లా కనిపిస్తున్నాడు. బౌలింగ్ లో బుధవారం నాటి మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన అతడు ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి 135 కిలోమీటర్ల వేగంతో బంతులేశాడు. దీంతోనే నితీశ్ కు మంచి భవిష్యత్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.