నితీశ్ రెడ్డి..చరిత్రత్మాక సెంచరీ..తెలుగు రాష్ట్రాల నుంచి 4వ వాడు
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విశాఖపట్నం కుర్రాడు నితీశ్‌రెడ్డి (105 బ్యాటింగ్) టెస్టు కెరీర్ లో తొలి శతకం కొట్టాడు.
By: Tupaki Desk | 28 Dec 2024 7:24 AM GMTరోహిత్ శర్మ విఫలమయ్యాడు.. విరాట్ కోహ్లి రాణించలేకపోయాడు.. రిషభ్ పంత్ బాదలేకపోయాడు.. కానీ, తెలుగు కుర్రాడు మాత్రం దుమ్మురేపాడు.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి సెంచరీ కొట్టేశాడు. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విశాఖపట్నం కుర్రాడు నితీశ్‌రెడ్డి (105 బ్యాటింగ్) టెస్టు కెరీర్ లో తొలి శతకం కొట్టాడు.
8వ స్థానంలో రికార్డు స్కోరు
మెల్ బోర్న్ టెస్టులో టీమ్ ఇండియాను ఫాలో ఆన్ గట్టెక్కించాడు 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి. 8వ వికెట్ కు స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి అద్భుత భాగస్వామ్యం అందించాడు. దీంతోపాటు నితీశ్ సెంచరీ కొట్టడంతో భారత జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 359 పరుగులు చేసింది. వాస్తవానికి రిషభ్ పంత్ జట్టు స్కోరు 191 పరుగుల వద్ద, రవీంద్ర జడేజా 221 పరుగుల వద్ద ఔటవడంతో టీమ్ ఇండియాకు ఫాలో ఆన్ తప్పదనిపించింది. కానీ, నితీశ్ సుందర్ తో కలిసి ఆ పరిస్థతి తప్పించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక స్కోరు మాత్రమే కాక సెంచరీ కొట్టిన వాడిగా నిలిచాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 358/9. ఆస్ట్రేలియా కంటే 116 పరుగులు వెనకబడి ఉంది.
తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగో వాడు
తెలుగు రాష్ట్రాల నుంచి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్ మన్ నితీశ్ కుమార్ రెడ్డి. ఎంఎల్ జైసింహా, వీవీఎస్ లక్ష్మణ్, అజహరుద్దీన్ తర్వాత నితీశ్ మాత్రమే ఈ ఘనత అందుకున్నాడు.
హాఫ్ సెంచరీ పుష్ప.. సెంచరీ బాహుబలి
నితీశ్ కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ కూడా ఈ మ్యాచ్ లోనే. ఆ సందర్భంగా అతడు పుష్ప స్టయిల్ లో ‘తగ్గేదేలే’ అంటూ బ్యాట్ ను తన గడ్డానికి అడ్డంగా తిప్పాడు. ఇక సెంచరీ పూర్తి కాగానే బాహుబలి స్టయిల్ బ్యాట్ ను గ్రౌండ్ లో ఉంచి..దానికి హెల్మెట్ తగలించాడు. కాగా, 21 ఏళ్ల 216 రోజుల వయసులో సెంచరీతో సచిన్ టెండూల్కర్ (18ఏళ్లు) తర్వాత అత్యంత చిన్న వయసులో మూడంకెల స్కోర్ అందుకున్న బ్యాటర్ గా నిలిచాడు.
కొసమెరుపు: నితీశ్ కోసం అతడి తండ్రి ముత్యాలరెడ్డి విశాఖ పట్టణం నుంచి మెల్ బోర్న్ వచ్చాడు. కుమారుడు సెంచరీ కొడతాడా? లేదా? అని అత్యంత ఉత్కంఠతో చూశాడు. చివరకు అంతా సుఖాంతం కావడంతో ఊపిరిపీల్చుకున్నాడు.