టీమిండియాలోకి అచ్చ తెలుగోడు.. ఒకే ఐపీఎల్ జీవితం మార్చేసింది
విశాఖపట్నం కుర్రాడు, సన్ రైజర్స్ హైదారాబాద్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియాలోకి ఎంపికయ్యాడు.
By: Tupaki Desk | 25 Jun 2024 5:30 PM GMTమొన్న జరిగిన ఐపీఎల్ సీజన్ ముందు వరకు అతడు ఎవరో క్రికెట్ వర్గాల్లోనే పెద్దగా తెలియదు.. కానీ, ఇప్పుడు అతడు టీమిండియా సభ్యుడు. కోట్లాదిమంది కలలుగనే అవకాశం ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ తో కొట్టేశాడు ఆ తెలుగు కుర్రాడు. అయితే, ఇదేమీ అంత తేలిగ్గా రాలేదు. 12 ఏళ్ల వయసులోనే అతడి తండ్రి ఆర్థిక కష్టం అంటే ఏమిటో చూశాడు.. తన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న నాన్న చేసిన త్యాగం ఏమిటో నిత్యం గుర్తు చేసుకున్నాడు. ఆ రగిలే స్ఫూర్తితో మైదానంలో రాణించాడు.
రాయుడు, విహారి తర్వాత
విశాఖపట్నం కుర్రాడు, సన్ రైజర్స్ హైదారాబాద్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియాలోకి ఎంపికయ్యాడు. వచ్చే నెల 6 నుంచి జింబాబ్వేతో జరిగే ఐదు టి20ల సిరీస్ కు అతడికి 15 మంది సభ్యుల జట్టులో చోటుదక్కింది. దీంతో నితీశ్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు మార్మోగుతోంది. వాస్తవానికి సరిగ్గా మూడు నెలల కిందట మొదలైన ఐపీఎల్ ద్వారానే నితీశ్ అంటే ఎవరో బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటివరకు జట్టులోని సభ్యులకు మాత్రమే తెలుసు. కానీ, మొన్నటి సీజన్ లో నితీశ్ ఆల్ రౌండ్ ప్రతిభ, ముఖ్యంగా బ్యాటింగ్ లో అతడి దూకుడు చూశాక మెరిట్ ఉన్నవాడిగా కనిపించాడు. అందులోనూ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావడంతో మరింత బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రకటించిన జట్టులో చోటు లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అంబటి రాయుడు, హనుమ విహారి తర్వాత ఇటీవలి కాలంలో టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డినే. పేసర్ సిరాజ్ కూడా ఎంపికయినప్పటికీ.. ఇతడు పూర్తిగా హైదరాబాదీ. అచ్చ తెలుగువాడని చెప్పలేం.
కాబోయే హార్దిక్..
భారత జట్టును మూడు దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. కపిల్ దేవ్ వంటి దిగ్గజం రిటైరైన తర్వాత మళ్లీ అలాంటి ప్లేయర్ దొరకలేదు. ఇర్ఫాన్ పఠాన్ నుంచి హార్దిక్ పాండ్యా వరకు ఎందరో ఆశలు రేకెత్తించినా ఎవరూ అంచనాలను అందుకోలేకపోయారు. నితీశ్ కుమార్ రెడ్డి గనుక నిలకడగా రాణిస్తే.. టీమిండియాకు మరో హార్దిక్ పాండ్యా అవుతాడు.
అప్పుడు పగుళ్లిచ్చిన బ్యాట్ తో..
నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఓసారి రాజస్థాన్ కు బదిలీ అయింది. నితీశ్ కు అక్కడ క్రికెట్ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో జాబ్ వదిలేశాడు ముత్యాలరెడ్డి. రూ.20 లక్షలు రాగా వాటితో వ్యాపారం చేశాడు. స్నేహితులు, బంధువులు మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోయాడు. అప్పుడు నితీశ్ వయసు 12 ఏళ్లు. కాగా, జూనియర్ గా ఉన్నప్పుడు నితీశ్ బ్యాట్ కు పగుళ్లు వస్తే బ్యాండేజ్ చుట్టుకుని ఆడాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియా చాన్స్ కొట్టేశాడు. ఇటీవలి ఐపీఎల్ లో నితీశ్ 11 ఇన్నింగ్స్ ల్లో 303 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్ ల్లో వికెట్లూ తీశాడు. వచ్చే సీజన్ కు వేలంలో మంచి ధర దక్కుతుందనడంలో సందేహం లేదు.