ఇద్దరే 20 వికెట్లు తీశారు.. 1,350 రోజుల తర్వాత టెస్టు గెలిపించారు
నొమన్ అలీ, సాజిద్ ఖాన్ మొత్తం 20 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ లో 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 144 కే ఆలౌటైంది.
By: Tupaki Desk | 19 Oct 2024 1:30 AM GMTటెస్టు మ్యాచ్ లు గెలవడం అంటే మామూలు విషయం కాదు.. ఎంతో ఓపిక.. మరెంతో ప్రతిభ.. ఇంకెంతో కష్టం ఉంటేనే టెస్టులు నెగ్గేందుకు అవకాశం చిక్కుతుంది. అయితే, ఒక జట్టు 1,350 రోజుల తర్వాత టెస్టు విజయాన్ని చూసింది. అందుకే సంప్రదాయ ఫార్మాట్ లో నెగ్గడం అంటే అంత కష్టం. కాగా, ఈ విజయం కేవలం ఇద్దరు బౌలర్ల వల్లే అయిందంటే నమ్మాల్సిందే.
నాలుగేళ్ల తర్వాత పాకిస్థాన్ లో టెస్టులు జరగడమే అరుదు. భద్రతా కారణాల రీత్యా చాలా జట్లు ఆ దేశంలో పర్యటించడమే లేదు. భారత్ అయితే ఓ 20 ఏళ్ల అయిందేమో పాకిస్థాన్ వెళ్లి. అయితే, రెండేళ్ల లోపే ఇంగ్లండ్ రెండోసారి పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. తొలి టెస్టులో పాకిస్థాన్ పై ఏకంగా 800 పైగా పరుగులు చేసింది. ఆతిథ్య దేశాన్ని ఘోరంగా ఓడిచింది. కానీ, రెండో టెస్టులో మాత్రం పాకిస్థాన్ పుంజుకుంది. సొంత గడ్డపై టెస్టు విజయం కోసం సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఇంగ్లండ్ ను 152 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
స్పిన్నర్ల పుణ్యమే..
ఇంగ్లండ్ తో తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పాకిస్థాన్ తమ స్టార్ బ్యాట్స్ బాబర్ అజామ్, స్పీడ్ స్టర్లు షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షాలను పక్కనపెట్టింది. కేవలం స్పిన్నర్లను నమ్ముకుంది. దీనికి తగిన న్యాయం చేశారు వారు. నొమన్ అలీ, సాజిద్ ఖాన్ మొత్తం 20 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ లో 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 144 కే ఆలౌటైంది. నొమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్ మొత్తం వికెట్లు పడగొట్టారు. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. కాగా, సాజిద్ మొదటి ఇన్నింగ్స్ లో ఏడు, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీశారు. నొమన్ అలీ మొదటి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లోనూ బాదుడే ఉద్దేశంగా బజ్ బాల్ క్రికెట్ ఆడే ఇంగ్లాండ్ ను ఇద్దరు స్పిన్నర్లే నిలువరించారు. 1987 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. టెస్టు చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లే మొత్తం 20 వికెట్లు తీయడం ఏడోసారి.
మూడేళ్లకు పైగా విరామం తర్వాత
పాకిస్థాన్ సొంతగడ్డపై 1,350 రోజుల తర్వాత టెస్టు గెలిచింది. 2021లో దక్షిణాఫ్రికాపై గెలిచాక మళ్లీ ఇప్పుడే నెగ్గడం. స్వదేశంలో వరుసగా 11 టెస్టులు ఓడింది. ఇందులో ఇటీవల బంగ్లాదేశ్ పై ఓడిన రెండు టెస్టులు కూడా ఉన్నాయి.