రెజ్లింగ్‌లో పతకం.. రైల్వే శాఖ ప్రమోషన్!
వేతనంతోపాటు.. ఇతర భత్యాలు, ఉచిత రవాణా వంటివి కల్పిస్తుంది. వారికి అవసరమైతే.. రైల్వే భద్రత కూడా కల్పిస్తుంది.
By: Tupaki Desk | 15 Aug 2024 4:41 PM GMTక్రీడాకారులను ప్రోత్సహించడంలో దేశంలో రైల్వే శాఖ చాలా ముందుంది. ఒక అంచనా ప్రకారం.. రైల్వే శాఖలో దేశవ్యాప్తంగా 20 వేల మంది అత్యున్నత క్రీడాకారులు ఉద్యోగులుగా ఉన్నారు. అంటే.. వారు ఎలాంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కానీ, ప్రతిభ ఉన్న క్రీడాకారులు తమ ఉద్యోగులు అని చెప్పుకొని గర్వంగా ఫీలయ్యేందుకు రైల్వే శాఖ ఇలా వారికి అవకాశం కల్పిస్తుంటుంది. వేతనంతోపాటు.. ఇతర భత్యాలు, ఉచిత రవాణా వంటివి కల్పిస్తుంది. వారికి అవసరమైతే.. రైల్వే భద్రత కూడా కల్పిస్తుంది.
ఇలా.. మన దేశంలోని అనేక క్రీడాకారులు రైల్వే శాఖలో ఉద్యోగులుగా ఉన్నారు. ఇలానే.. అమన్ సెహ్రోవత్ కూడా.. రైల్వే ఉద్యోగే. ప్రముఖ రెజ్లర్ అయిన.. అమన్‌కు గతంలోనే రైల్వే శాఖలో ప్రత్యేక అధికారిగా ఉద్యోగం ఇచ్చారు. ఆయన ఉద్యోగం అంటే.. పైన చెప్పుకొన్నట్టు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఏదైనా రైల్వే శాఖ యాడ్ ఇవ్వాలని అనుకున్నప్పుడు.. వారి సేవలను వాడుకుంటుంది. జీత భత్యాలు కామన్. ఇలా.. అమన్ రెండేళ్లుగా రైల్వేలో పనిచేస్తున్నారు.
ఇక, తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో అమన్ 57 కిలోల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం కొట్టాడు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. దీనిని రైల్వే ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు రైల్వే శాఖ ఇతర క్రీడాకారులకు మాదిరిగానే.. ఈయనకు కూడా సహకరించింది. ఇక, ఇప్పుడు ప్రత్యేక అధికారి పోస్టులో ఉన్న అమన్‌ను.. ఉత్తర రైల్వేలో ఓఎస్‌డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ప్రమోషన్ కల్పించింది. దీంతో ఆయన వేతనం నెలకు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు పెరుగుతుంది. ఇతర అలవెన్సులు, క్రీడా నైపుణ్యం పెంచుకునేందుకు ఇచ్చే భత్యాలు కూడా పెరగనున్నాయి.