Begin typing your search above and press return to search.

టి20 కాదు.. టి10.. ఆలోచన అదుర్స్.. మన దగ్గరే

మ్యాచ్ ఫిక్సింగ్ సహా ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా.. ఐపీఎల్ మాత్రం ఆగలేదు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 10:18 AM GMT
టి20 కాదు.. టి10.. ఆలోచన అదుర్స్.. మన దగ్గరే
X

భారత క్రికెట్ చరిత్రను పుస్తకాల్లోకి ఎక్కించాలంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ముందు.. ఐపీఎల్ తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. కరీబియన్ లీగ్.. బిగ్ బాష్ లీగ్.. పాకిస్థాన్ సూపర్ లీగ్.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లీగ్ లు ఉండొచ్చు.. కానీ, ఐపీఎల్ రేంజ్ వేరు.. ఓటమి నుంచి పుట్టిన విజయంగా దానిని అభివర్ణించాల్సి ఉంటుందేమో?

లక్ష కోట్ల వైపు రయ్ రయ్

2008లో ప్రారంభమైన ఐపీఎల్ రోజురోజుకు దూసుకెళ్తోంది. ఇప్పటికి 16 సీజన్లు ముగిశాయి. మ్యాచ్ ఫిక్సింగ్ సహా ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా.. ఐపీఎల్ మాత్రం ఆగలేదు. అంతగా ప్రజాదరణ పొందింది ఈ లీగ్. మరికొన్ని రోజుల్లో లీగ్ 17వ సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుంది. మార్చి 23 నుంచి మొదలయ్యే సీజన్ కు ఫ్రాంచైజీలన్నీ సిద్ధం అవుతున్నాయి. కాగా, ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ ఎంతనో తెలిస్తే.. ఔరా అనాల్సిందే. తాజా అంచనాల ప్రకారం 10 బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువను దాటి డెకాకార్న్‌ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ 10.7 బిలియన్‌ డాలర్లు (రూ.83,353 కోట్లు). ఐపీఎల్‌ ఆరంభమైన 2008తో పోలిస్తే బ్రాండ్ వాల్యూ ఏకంగా 433 శాతం వృద్ధి చెందింది.

టైర్- 2లో టి10

వన్డేలు చప్పగా సాగుతున్న దశలో దాదాపు 20 ఏళ్ల కిందట టి20లు పుట్టుకొచ్చాయి. క్రికెట్ గతినే మార్చివేశాయి. వన్డేల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు టి20లు కూడా పోయి టి10లు రానున్నాయట. వాస్తవానికి టి10ల ఆలోచన క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్ లోనే పురుడు పోసుకుంది. ఇప్పటికే అక్కడ టి10 మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే, ప్రొఫెషనల్ క్రికెట్ లోకి రాలేదు. కానీ, తాజాగా బీసీసీఐ ‘‘టి10’’ ఆలోచన చేస్తోందట. ఐపీఎల్ కాసుల వర్షంలో తడిసి ముద్దవుతున్న బీసీసీఐ.. టి10 ఫార్మాట్ లో టైర్-2 క్రికెట్ లీగ్ ఆడించాలని చూస్తోందట. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ పై బీసీసీఐ కార్యదర్శి జై షా పనిచేస్తున్నారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో

టి10 లీగ్ వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. విశేషం ఏమంటే.. ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీల కోసం పెట్టుబడిదారులు తామంటే తామని ముందుకొస్తున్నారట. ఐపీఎల్ 8 జట్లతో మొదలై.. 10కి పెరిగింది. మరిప్పుడు టి10 లీగ్ లో ఎన్ని జట్టు ఉంటాయో చూడాల్సిందే.