Begin typing your search above and press return to search.

టెన్నిస్ 'కోర్ట్' లో మరో చరిత్ర.. జకో.. సాహో

లీగ్ దశలో అయినా.. ఫైనల్ అయినా ఆటను నిదానంగా ప్రారంభించడం జకోవిచ్ శైలి. క్రమంగా పుంజుకునే అతడు ప్రత్యర్థిని చిత్తు చేస్తాడు

By:  Tupaki Desk   |   11 Sep 2023 6:45 AM GMT
టెన్నిస్ కోర్ట్ లో మరో చరిత్ర.. జకో.. సాహో
X

పురుషుల టెన్నిస్ లో మరో చరిత్ర.. సమకాలీన ఆటగాళ్లలో తనకెవరూ సాటి లేరని చాటుతూ.. తనది అందనంత ఎత్తు అని చూపుతూ.. మున్ముందు కూడా తనను ఎవరూ చేరుకోలేరని ఢంకా బజాయిస్తూ సెర్బియన్ యోధుడు రికార్డు స్థాపించాడు. నవ్విన నాప చేనే పండుతుందనే సామెత వారికి తెలుసో లేదో కాని అతడు అలాంటి కోవక చెందినవాడే. 20 ఏళ్ల కిందట పీట్ సంప్రాస్ 14 గ్రాండ్ స్లామ్ లు గెలిస్తే అబ్బో అనుకున్నా.. పదేళ్ల కిందట ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ లు కొడితే అహో అని కీర్తించాం.. ఐదేళ్ల కిందట నాదల్ 21వ టైటిల్ కొడితే అతడే ఇక కింగ్ అని కొనియాడాం.. కానీ వీరందరినీ మించిన మొనగాడిని తానని నిరూపించాడు నొవాక్ జకోవిచ్. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటాక జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌ ను జకో చిత్తు చేశాడు. ఫలితంగా 24వ గ్రాండ్ స్లామ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ అలవాటును అధిగమించి..

లీగ్ దశలో అయినా.. ఫైనల్ అయినా ఆటను నిదానంగా ప్రారంభించడం జకోవిచ్ శైలి. క్రమంగా పుంజుకునే అతడు ప్రత్యర్థిని చిత్తు చేస్తాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో మాత్రం ఎందుకో జకో భిన్నంగా కనిపించాడు. తొలి సెట్ ను ఓడాక కాని మళ్లీ పైచేయికి ప్రయత్నించే అలవాటును మానుకుని.. మూడు వరుస సెట్లలో మెద్వదేవ్ ను ఓడించాడు. కాగా, 23 టైటిళ్లతో ఇప్పటికే జకో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు సాధించిన వీరుడిగా ఉన్నాడు. యూఎస్ ఓపెన్ టైటిల్ తో దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు.

కోర్ట్ తో రికార్డు సమం..

జకోవిచ్ ను మరో రికార్డు ఊరిస్తుండవచ్చు. అదేమంటే.. టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గడం. వాస్తవానికి మహిళా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్‌ కోర్ట్‌ 24 టైటిళ్లతో ఇప్పటివరకు టాప్ లో ఉంది. తాజాగా ఆమెను అందుకున్నాడు జకో. కాగా, మెద్వదేవ్ తో జకో ఫైనల్‌ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించిచా భిన్నంగా జరిగింది. 6-3, 7-6(7-5), 6-3 తేడాతో జకో వరుస సెట్లలో మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ను మట్టికరిపించాడు. 2021 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జకోను మెద్వదేవ్ ఓడించి తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ కొట్టాడు. కాగా, తొలి సెట్‌లో 6-3 తేడాతో మెద్వదేవ్ ను జకో చిత్తుచేశాడు. రెండో సెట్‌ హోరాహోరీగా సాగింది. మెద్వెదెవ్‌ గెలిచేలా కనిపించాడు. పుంజుకున్న జకో 6-6 తో స్కోర్ సమం చేశాడు. అనంతరం 7-6 తేడాతో రెండో సెట్‌ ను గెలిచాడు. మూడో సెట్‌లో మెద్వెదెవ్‌ తేలిపోయాడు. జకో 6-3 తేడాతో గెలిచి టైటిల్ ను ఒడిసిపట్డు. ఈ మ్యాచ్ 3.17 నిమిషాలు సాగింది.

గోల్డెన్ స్లామ్ మిస్

టెన్నిస్ లో ఏటా నాలుగు గ్రాండ్ స్లామ్ లు జరుగుతాయి. ఈ ఏడాది నాలుగింటిలోనూ ఫైనల్స్‌కు చేరాడు జకోవిచ్. ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌లో గెలిచాడు. తనకెంతో ఇష్టమైన వింబుల్డన్‌లో మాత్రమే యువ ఆటగాడు కార్లోస్‌ అల్కరాస్‌ చేతిలో ఓడాడు. అదికూడా గెలిచి ఉంటే ఒకే ఏడాదిలో అన్ని గ్రాండ్ స్లామ్ లు గెలిచి అరుదైన గోల్డెన్ స్లామ్ రికార్డును అందుకునేవాడు. పనిలో పనిగా అప్పుడే కోర్ట్ ను సమం చేసి.. ఇప్పుడు 25వ టైటిల్ కు చేరేవాడు. ఆ రికార్డు మిస్ అయిందనుకున్నా.. ఎప్పటికైనా జకోనే టాప్ ఆటగాడిగా ఉంటాడనడంలో సందేహం లేదు.