Begin typing your search above and press return to search.

వన్డే ప్రపంచ కప్.. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం డేట్ ఇదే..

తొలిసారి పూర్తి స్థాయిలో భారత్ ప్రపంచ కప్ ను నిర్వహిస్తుండడం ఈసారి ప్రత్యేకత

By:  Tupaki Desk   |   29 July 2023 9:30 AM GMT
వన్డే ప్రపంచ కప్.. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం డేట్ ఇదే..
X

సరిగ్గా 65 రోజుల్లో వన్డే ప్రపంచ కప్ జరుగనుంది. తొలిసారి పూర్తి స్థాయిలో భారత్ ప్రపంచ కప్ ను నిర్వహిస్తుండడం ఈసారి ప్రత్యేకత. నెదర్లాండ్స్ సహా మొత్తం 10 జట్లు పాల్గొననున్న టోర్నీని రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇక మిగిలింది టికెట్ల విక్రయం ఎప్పటినుంచి అనేదే..?

అక్టోబరు 5 నుంచి నవంబరు 19వ తేదీ వరకు ప్రపంచ కప్ మొత్తం పది వేదికల్లో జరగనుంది. కాగా, తొలుత ప్రకటించిన షెడ్యూల్ లో జరగబోయే మార్పుల్లో భారత్ - పాక్‌ మ్యాచ్‌ కూడా ఉంది. ఈ మ్యాచ్ మొదట అనుకున్నదాని ప్రకారం అక్టోబరు 15న జరగాలి. కానీ, దసరా నవరాత్రుల ప్రారంభం కారణంగా ఒక రోజు ముందుకు జరిగే అవకాశం ఉంది. ఈ విషయం నిర్ధారించేందుకు ఐసీసీ, బీసీసీఐ సహా సభ్య దేశాలు భేటీ అయ్యాయి. అందులోనే టికెట్ల విక్రయాల పైనా చర్చ జరిగినట్లు సమాచారం.

త్వరపడండి.. మరో 12 రోజుల్లో..

ఈ రోజు జూలై 29 కాగా.. ఆగస్టు 10 నుంచి ఆన్‌ లైన్‌ లో ప్రపంచ కప్ టికెట్ల విక్రయాలు మొదలుకానున్నాయి. దీనిని ఐసీసీ నిర్ధారించాల్సి ఉంది. టికెట్ ధర, మైదానాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలతో చర్చించారు. కొన్ని మ్యాచ్‌ లను రీ షెడ్యూల్ చేయాలనే విజ్ఞప్తులు ఐసీసీకి చేరినట్లు జై షా తెలిపారు.

"షెడ్యూలింగ్‌ కు సంబంధించిన సమస్యలు 3 -4 రోజుల్లో పరిష్కారమవుతాయి. షెడ్యూల్‌ మార్పు కోరుతూ మూడు జట్లు ఐసీసీకి లేఖ రాశాయి. కానీ మైదానాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. మ్యాచ్‌ తేదీ, సమయంలోనే మార్పులుంటాయి. అభ్యంతరాలు తెలిపిన జట్ల మ్యాచ్‌ లకు వ్యవధి ఆరు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దానిని నాలుగు లేదా ఐదు రోజులకు కుదిస్తాం. దీనిపై స్పష్టత రావాలంటే మరో మూడు రోజులు పడుతుంది. ఏ మార్పులైనా ఐసీసీని సంప్రదించే చేయాల్సి ఉంటుంది. భారత్ -పాక్‌ మ్యాచ్‌ విషయంలోనూ ఇదే విధంగా చర్యలు ఉంటాయి" అని వెల్లడించారు.