వన్డే ప్రపంచ కప్ మనదే.. ఆసీస్ లెక్క సరి.. ఇదిగో ఇలా
చిన్న జట్ల సంచలన ప్రదర్శనలు.. పెద్ద జట్ల దారుణ పరాజయాలు.. వెంటాడిన వైఫల్యాలు.. వీటన్నిటి మధ్య ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది.
By: Tupaki Desk | 17 Nov 2023 10:39 AM GMTచిన్న జట్ల సంచలన ప్రదర్శనలు.. పెద్ద జట్ల దారుణ పరాజయాలు.. వెంటాడిన వైఫల్యాలు.. వీటన్నిటి మధ్య ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అందుకు రెండు రోజులే.. ఆపై నాలుగేళ్ల పాటు ప్రపంచ విజేత ఎవరో తేలిపోనుంది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్లో తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది.
భారత్ కు నాలుగోసారి
టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. 1983లో తొలిసారి వరల్డ్ కప్ తుది సమరానికి వచ్చింది. ఆ ప్రయత్నంలోనే కప్ కొట్టేసింది. కాగా.. 1987, 1992, 1996, 1999 ప్రపంచ కప్ లలో ఫైనల్ చేరడంలో విఫలమైంది. 1987, 1996లో మాత్రమే సెమీస్ వరకు రాగలిగింది. తొలిసారి ఫైనల్ చేరిన 20 ఏళ్ల తర్వాత 2003లో సౌరభ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా ఫైనల్ చేరింది. నాడు ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 2007లో ఘోర పరాభవం తర్వాత 2011లో సొంతగడ్డపై కప్ కొట్టి సగర్వంగా నిలిచింది. 2015,19లో సెమీస్ తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఆసీస్ కు ఎనిమిదోసారి..
రికార్డు స్థాయిలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఎనిమిదిసార్లు ఫైనల్ చేరింది. 1979, 1987, 1996, 1999, 2003, 2007, 2015, 2023లో తుది సమరానికి వచ్చింది. ఇందులో 1987, 1999, 2003, 2007, 2015లో కప్ ను కొట్టేసింది. 2003 తర్వాత సరిగ్గా 20 ఏళ్లకు భారత్ తో మరోసారి తలపడనుంది. కాగా, 1987లో తొలిసారి ఆస్ట్రేలియా ప్రపంచ చాంపియన్ గా నిలిచినపుడు కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది భారతదేశమే. 1996లో మన దేశమే ఆతిథ్యం ఇచ్చినా.. ఫైనల్ పాకిస్తాన్ లోని లాహోర్ లో జరిగింది.
ఇదీ లెక్క..
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆసీస్-భారత్ ఫైనల్లో తలపడుతున్న నేపథ్యంలో.. 2003 నాటి ప్రపంచ కప్ లో ఏం జరిగిందోనని అందరూ ఆరా తీస్తున్నారు. కొందరైతే.. నాటి కప్ గణాంకాలను సరిపోల్చి, ఈసారి భారత్ విజేతగా నిలుస్తుందని జోస్యం చెబుతున్నారు. కాగా, 2003లో ఆస్ట్రేలియా అజేయంగా నిలిచి టైటిల్ కొట్టింది. వరుసగా పది మ్యాచ్ లు గెలిచి ఫైనల్ చేరి కప్ గెలిచింది. ఇక భారత్ వరుసగా 8 మ్యాచ్ లు నెగ్గి ఫైనల్ చేరి, ఓడిపోయింది. ఇప్పుడు సరిగ్గా ఇలాగే..భారత్ వరుసగా 10 మ్యాచ్ లు నెగ్గి ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా వరుసగా 8 మ్యాచ్ లలో విజయం సాధించి తుది సమరానికి వచ్చింది. 2003లో ఆసీస్ గెలిచినదున.. ఇప్పుడు భారత్ దే పైచేయి అవుతుందని చెబుతున్నారు.
కొసమెరుపు: 2003లో ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ పరాజయం అభిమానులను చాలారోజులు వెంటాడింది. ఇలాగే 2019లో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఓటమి కూడా చాలా రోజులు బాధించింది. బుధవారం న్యూజిలాండ్ పై మొదటి సెమీస్ లో గెలిచిన టీమిండియా దానికి బదులు తీర్చుకుంది. ఇక మిగిలింది ఆస్ట్రేలియా. దానినీ చుట్టేసి.. 2003 నాటి ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి సమాధానం చెప్పాలని అభిమానులు ఆశిస్తున్నారు.