ఒక్క రోజులో 400.. 88 ఏళ్ల రికార్డు బద్దలు.. అమ్మాయిలే..
అయితే, మహిళా క్రికెట్ లో టెస్టుల కూడా ఉన్నాయన్న సంగతి చాలామంది అభిమానులు మరిచిపోయారు.
By: Tupaki Desk | 15 Dec 2023 11:17 AM GMTక్రికెట్ అంటే పురుషుల క్రీడ అనే అర్థాన్ని చెరిపేస్తూ.. తామూ రికార్డులు నెలకొల్పగమని చాటుతూ.. తమలోనూ టెస్టులు ఆడగల సత్తా ఉందని చెబుతూ.. అమ్మాయిలు (మహిళలు) రాణిస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ టి20ల్లో మహిళా క్రికెట్ మరింత ఆదరణ పొందుతోంది. అందుకే ఈ ఫార్మాట్ లో బీసీసీఐ ఏకంగా మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మొదలుపెట్టింది. అయితే, మహిళా క్రికెట్ లో టెస్టుల కూడా ఉన్నాయన్న సంగతి చాలామంది అభిమానులు మరిచిపోయారు.
రెండేళ్ల తర్వాత
పురుషుల క్రికెట్ లో జరిగినంత తరచుగా మహిళా క్రికెట్ లో టెస్టులు జరగవు. దీనికి అనేక కారణాలున్నాయి. టెస్టుల నిర్వహణ ఖర్చు విషయం పక్కనపెడితే ఆదరణ అనేది చాలా తక్కువ అని చెప్పకతప్పదు. అందుకనే.. మహిళా క్రికెట్ లో ప్రధాన జట్టు అయినప్పటికీ, భారత్ టెస్టులు ఆడక దాదాపు రెండేళ్లవుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు మాత్రం తరచూ సంప్రదాయ ఫార్మాట్ లో తలపడుతూ ఉంటాయి. తాజా విషయానికి వస్తే భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. టి20 సిరీస్‌ను ఆతిథ్య దేశానికి కోల్పోయింది. గురువారం మొదలైన ఏకైక టెస్టును మాత్రం ఘనంగా ఆరంభించింది. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో తొలి రోజు తిరుగులేని స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ధాటిగా పరుగులు రాబట్టింది. ఏడు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఓపెనింగ్ కు దిగిన శుభ (69; 76 బంతుల్లో 13×4), జెమీమా రోడ్రిగ్స్ (68; 99 బంతుల్లో 11×4)తో పాటు యాస్తిక భాటియా (66; 88 బంతుల్లో 10×4, 1×6), దీప్తి శర్మ (60 బ్యాటింగ్; 95 బంతుల్లో 9×4, 1×6) దూకుడుగా అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (49; 81 బంతుల్లో 6×4) రాణించింది.
చరిత్రలో రెండో జట్టు
మహిళల టెస్టులో ఒక్క రోజే 400పై పరుగులు చేసిన రెండో జట్టుగా భారత్ మాత్రమే. ఒక జట్టు ఒక్క రోజులో 400 పైగా చేయడం 88 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారి (అదే తొలిసారి) 1935లో ఇంగ్లాండ్ మహిళల జట్టు న్యూజిలాండ్ పై రెండు వికెట్లకు 431 పరుగులు చేసింది. మరొక్క 14 పరుగులు చేసి ఉంటే.. ఒక్క రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా మన మహిళల జట్టు చరిత్రలో నిలిచిపోయేదే. వాస్తవానికి అమ్మాయిలు టెస్టులు ఆడక దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినా ఆ ప్రభావం కనిపించలేదు. శుభ, జెమీమా ఎడాపెడా బౌండరీలు బాదారు. 115 పరుగుల భాగస్వామ్యం (టెస్టు క్రికెట్లో మూడో వికెట్‌కు రెండో అత్యధికం) నెలకొల్పారు.
కొసమెరుపు: టెస్టుల్లో భారత మహిళలు గెలుపు చూసి చాలా రోజులైంది. ఆ నిరీక్షణకు తెరదించుతూ మన జట్టు ఈ మ్యాచ్ లో గెలిచేలా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో 428 పరుగులకు ఆలౌటైన మన జట్టు.. ఇంగ్లండ్ ను 136 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మొత్తమ్మీద 400 పైగా పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో మూడు రోజుల ఆట ఉన్నందున గెలుపు మన జట్టుదే అనడంలో సందేహం లేదు.