Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ ఫుట్ బాల్ లో రచ్చ.. అర్జెంటీనాకు మొరాకో మచ్చ

ఈ మ్యాచ్ లో 2-1తో మొరాకో నెగ్గడం ఓ సంచలనం అయితే.. అంతకుమించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   25 July 2024 12:48 PM GMT
ఒలింపిక్స్ ఫుట్ బాల్ లో రచ్చ.. అర్జెంటీనాకు మొరాకో మచ్చ
X

సహజంగా క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడల్లో మ్యాచ్ లు హుందాగానే జరుగుతాయి. రగ్బీ, ఫుట్ బాల్ వంటి వాటిలో మాత్రం దూకుడు పెరిగి నానా రచ్చ జరుగుతుంది. ప్రపంచ కప్ మ్యాచ్ లు అయినా.. యూరో, కోపా వంటి ఒకే ఖండం తలపడే దేశాల మ్యాచ్ లు అయినా ఉద్రిక్తతలు సాధారణం. ఇప్పుడు ఒలింపిక్స్ వంతు. శుక్రవారం నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ జరగనుంది. అయితే, ఒలింపిక్స్ లో ఫుట్ బాల్ ను తొందరగానే నిర్వహిస్తారు. ఇలా బుధవారం ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా, మొరాకోతో తలపడింది. ఈ మ్యాచ్ లో 2-1తో మొరాకో నెగ్గడం ఓ సంచలనం అయితే.. అంతకుమించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

తొలి ఈవెంటే..

ఒలింపిక్స్ కు రెండు రోజులు ముందే ప్రారంభమైన ఫుట్ బాల్ మ్యాచ్ లో రగడ, గందరగోళం నెలకొనడం గమనార్హం. మొరాకో అభిమానులు స్టేడియంలోకి దూసుకురావడంతో ఓ దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మ్యాచ్ ను సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది.అసలు 2-2తో డ్రాగా ముగిసిందని అనుకుంటుండగా మొరాకో విజేత (2-1)గా నిలిచింది. ఈ మ్యాచ్ లో మొరాకోకు చెందిన రహిమి (45+2, 51వ) గోల్స్‌ కొట్టాడు. అయితే, 68వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు సిమోన్‌ గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని తగ్గించాడు. కానీ, ప్రపంచ చాంపియన్ జట్టుకు మరో గోల్ కొట్టడం దుర్లభమైంది.

ఇంజురీ టైమ్‌ 16వ నిమిషంలో క్రిస్టియన్‌ మెదినా గోల్‌ చేయడంతో అర్జెంటీనా 2-2తో స్కోరు సమం చేసింది. అయితే, ఈ గోల్‌ సరైంది కాదని నిరసన తెలుపుతూ మొరాకో అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. అర్జెంటీనా ఆటగాళ్లపై నీళ్ల సీసాలు, వస్తువులను విసిరారు. ఈ గందరగోళం మధ్య అధికారులు మ్యాచ్‌ ను సస్పెండ్‌ చేశారు. దీనిని ఫుల్‌ టైమ్‌ విజిల్‌ గా భావించారు. ఫిఫా వెబ్‌ సైట్‌ కూడా మ్యాచ్‌ అయిపోయిందని చూపించింది. కానీ, ఉద్రిక్తత తగ్గాకే.. మ్యాచ్‌ ను సస్పెండ్‌ చేశారని అర్థమైంది.

మ్యాచ్ 90 నిమిషాలు.. విరామం 75 నిమిషాలు

సహజంగా ఫుట్ బాల్ మ్యాచ్ సమయం 90 నిమిషాలు. అర్జెంటీనా-మొరాకో మ్యాచ్ లో 75 నిమిషాల తర్వాత జట్లు మళ్లీ మైదానంలోకి వచ్చాయి. కానీ, అప్పటికే ప్రేక్షకులున స్టేడియం నుంచి పంపించివేశారు. ఇక్కడ మరో మలుపు చోటుచేసుకుంది. అర్జెంటీనా చేసిన రెండో గోల్‌ ను ఆఫ్‌ సైడ్‌ అంటూ ప్రకటించారు. అనంతరం మూడు నిమిషాల్లో మ్యాచ్‌ ముగిసిపోయింది.