చెత్త రికార్డులు..తీవ్ర విమర్శలు..కోచ్ ఔట్..పాక్ క్రికెట్ సంక్షోభం
తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై, రెండో మ్యాచ్ లో భారత్ పై ఓడడంలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే టోర్నీ నుంచి వెళ్లిపోయింది. ఇక బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గెలిచినా పరువు దక్కుతుంది అంతే.
By: Tupaki Desk | 25 Feb 2025 9:27 AM GMTమామూలుగా పాకిస్థాన్ క్రికెట్ అంటేనే సంక్షోభానికి మారు పేరు.. అలాంటిది భారత్ చేతిలో ఓడిపోయి.. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో సెమీస్ రేసు నుంచి చాలా ముందే వెళ్లిపోతే.. ఇంకేమైనా ఉందా? అందుకే ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనంతంర పాకిస్థాన్ జట్టుపై ముప్పేట దాడి జరుగుతోంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై, రెండో మ్యాచ్ లో భారత్ పై ఓడడంలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే టోర్నీ నుంచి వెళ్లిపోయింది. ఇక బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గెలిచినా పరువు దక్కుతుంది అంతే.
పాకిస్థాన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్. 2017లో జరిగిన టోర్నీలో భారత్ పై నెగ్గి తొలిసారి టైటిల్ కొట్టింది. మరోవైపు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై ఓ ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇలా ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 2009లో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్ లలో ఒకటే గెలిచి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
డిఫెండింగ్ చాంపియన్ గా దిగి సెమీస్ చేరకుండా నిష్క్రమించిన నాలుగో జట్టుగా పాకిస్థాన్. 2002లో ట్రోఫీని సంయుక్తంగా నెగ్గిన భారత్-లంక.. 2004లో సెమీస్ కు చేరలేదు. 2009లో టోర్నీ నెగ్గిన ఆస్ట్రేలియాలో 2013లో ఒక్క మ్యాచ్ లోనూ గెలవకుండా లీగ్ దశలోనే ఔటయ్యారు.
కోచ్ ఖేల్ ఖతం..
ఏదైనా టోర్నీలో విఫలమైతే పాకిస్థాన్ జట్టు కోచ్, కెప్టెన్ ను బలి పశువులను చేయడం మొదటినుంచి ఉన్నదే. ఇప్పుడు ఇలానే తాత్కాలిక కోచ్ అకిబ్ జావెద్, సహాయక సిబ్బందిపై వేటు వేయనున్నట్లు సమాచారం. అకిబ్ జావెద్.. మేటి పేస్ బౌలర్. నిరుడు దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేయడంతో అకిబ్ ను పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక్ కోచ్ గా నియమించారు. ఆస్ట్రేలియా పేసర్ జాసన్ గిల్లెస్పీ తప్పుకోవడంతో టెస్టు జట్టుకూ అకిబ్ నే కోచ్ గా కొనసాగించారు. ఇప్పుడు అతడిని సాగనంపేందుకు సిద్ధమయ్యారు.
అబ్రార్.. అంత సంబరం ఎందుకు?
ఆదివారం భారత్ తో మ్యాచ్ లో ఓపెనర్ శుబ్ మన్ గిల్ ను ఔట్ చేసిన పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సెలబ్రేషన్ ను దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రమ్ తీవ్రంగా తప్పుబట్టాడు.. ‘‘గిల్ ను వెళ్లు వెళ్లు’’ అంటూ తలూపుతూ అబ్రార్ సంజ్ఞలు చేశాడు. అద్భుతమైన బంతితో గిల్ ను ఔట్ చేసిన అబ్రార్.. ఆ తర్వాత సంబరాల మీద అభ్యంతరం తెలిపాడు. దేనికైనా సమయం, సందర్భం ఉండవా? అని నిలదీశాడు. జట్టు గెలుస్తున్నప్పుడు సంబరాలు చేసుకుంటే పర్వాలేదని కష్టాల్లో వికెట్ లభిస్తే వినయంగా ఉండకుండా ఇలా చేయడం ఏమిటని మండిపడ్డాడు. అబ్రార్ తీరు సరిగా లేదని తేల్చిచెప్పాడు. అంతేకాదు.. దేశ క్రికెట్ లో భారీ మార్పులు చేయాలని.. పీసీబీ, సెలక్టర్ల పనితీరు బాగోలేదని తప్పుపట్టాడు. ఆడలేకపోతున్న సీనియర్లను నిర్ధాక్షణ్యంగా తప్పించాలని.. పరోక్షంగా బాబర్ అజామ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. జట్టు బౌలింగ్ కూడా ఘోరంగా ఉందని మండిపడ్డాడు. అమెరికా, ఒమన్ సహా వన్డేలు ఆడే 14 జట్లలో అత్యంత దారుణమైన బౌలింగ్ యావరేజీ ఉన్న రెండో జట్టు పాకిస్థానేనని.. గత ఐదు మ్యాచ్ లలో తమ బౌలర్లంతా 60 సగటుతో 24 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారని తెలిపాడు. జట్టును చూసి పీసీబీ చైర్మనే.. అవసరమైతే మార్చాలని కోరాడంటే సెలక్షన్ ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవాలని అక్రమ్ వివరించాడు. గంట సమావేశమై.. మళ్లీ అదే జట్టుతో రావడాన్ని గుర్తు చేశాడు. ఓటమికి కెప్టెన్ కూడా బాధ్యత తీసుకోవాలని కోరాడు.
రెగ్యులర్ ఓపెనర్ ను పక్కనపెట్టి, ఒక స్పిన్నర్‌తో మెగా టోర్నీకి వెళ్లడాన్ని మేటి ఆల్ రౌండర్ ఆఫ్రిది ప్రశ్నించాడు. ఫాహిమ్ అష్రాఫ్, కుష్ దిల్ షా ఎంపిక పూర్తిగా రాజకీయం అని ఆరోపించాడు. కనీసం 50 ఓవర్లు దానంలో నిలవలేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు నుంచి విజయాన్ని ఏం ఆశిస్తామని మాజీ బ్యాటర్ ఇజాజ్ అహ్మద్ ఎద్దేవా చేశాడు.
పాకిస్థాన్ బుర్ర లేని జట్టు అని స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ విమర్శించాడు. భారత్ చేతిలో ఓటమితో నిరాశ చెందలేదని.. ఏం జరుగుతుందో తనకు ముందే తెలుసని అన్నాడు. ఆటగాళ్లే కాదు.. జట్టు మేనేజ్‌మెంట్ కూడా తెలివి తక్కువవాళ్లు అని నిందించాడు.
కొసమెరుపు: ట్రోఫీ నుంచి పాక్ నిష్క్రమించిన నేపథ్యంలో మిగిలిన మ్యాచ్ లకు అభిమానుల్లో ఎలాంటి స్పందన ఉంటుందోనని పాక్ బోర్డు భయపడుతోంది.