‘చాంపియన్స్’లో వెయ్యి కోట్ల నష్టం.. పాకిస్థాన్ కు ఏడుపే తక్కువ
అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహించడం అంటే మాటలు కాదు.. అనేక దేశాలు పాల్గొనే ఇలాంటి టోర్నీలు ఒక్కటి తమ దేశానికి వచ్చినా బాగు పడిపోతామని శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు భావిస్తుంటాయి
By: Tupaki Desk | 18 March 2025 6:00 AM ISTఅంతర్జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహించడం అంటే మాటలు కాదు.. అనేక దేశాలు పాల్గొనే ఇలాంటి టోర్నీలు ఒక్కటి తమ దేశానికి వచ్చినా బాగు పడిపోతామని శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు భావిస్తుంటాయి. ఈ లెక్కన తాజాగా పాకిస్థాన్ నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీలో ఆ దేశానికి బాగానే గిట్టుబాటు అయి ఉండాలి అనుకుంటారా? దాదాపు 30 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ నిర్వహించింది కాబట్టి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు కనీసం రూ.500 కోట్లు అయినా వచ్చి ఉంటాయని అనుకుంటున్నారా?
డిఫెండింగ్ చాంపియన్స్ గా బరిలో దిగి ఒక్క గెలుపు కూడా లేకుండా వెనుదిరిగిన పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీలో చెత్త రికార్డును మూటగట్టుకుంది. పైగా టీమ్ ఇండియా ఆ దేశంలో పర్యటించకపోగా తటస్థ వేదిక దుబాయ్ లో ఆడింది. చాంపియన్స్ గానూ నిలిచింది. ఇది పాకిస్థాన్ కు మరింత మంట పుట్టించింది.
దుబాయ్ లో జరిగిన ఫైనల్ అనంతరం పాకిస్థాన్ ప్రతినిధులే లేకుండా టీమ్ ఇండియాకు ట్రోఫీ ప్రజంటేషన్ జరిగింది. ఇన్ని అవమానాల మధ్య.. పాకిస్థాన్ కు పుండు మీద కారం తరహా అనుభవం ఏమంటే.. ఆర్థికంగా ఎదురైన నష్టం.
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అసలే దారిద్ర్యంలో ఉన్న ఆ బోర్డుకు ఇది కోలుకోలేని దెబ్బ. భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లతో కలిసి ఒకే గ్రూప్ లో ఉన్న పాకిస్థాన్ స్వదేశంలో ఆడింది ఒకే ఒక్క మ్యాచ్. అదీ లాహోర్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. దుబాయ్ లో భారత్ తోనూ ఓడగా, బంగ్లాదేశ్ తో చివరి, మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ట్రోఫీ కోసం పీసీబీ 18 బిలియన్ పాకిస్థాన్ రూపాయలు (58 మిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. రావల్ఫిండి, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునికీకరణ చేపట్టగా.. బడ్జెట్ 50 శాతం పెరిగింది. ఈవెంట్ సన్నాహాల కోసం 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. హోస్టింగ్ ఫీజులో పీసీబీ 6 మిలియన్ డాలర్లు మాత్రమే పొందింది. టికెట్ అమ్మకాలు, స్పాన్సర్ షిష్ ల ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తమ్మీద 85 మిలియన్ డాలర్లు బొక్క పడింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోత పెడుతుండడం గమనార్హం.
జాతీయ టి20 చాంపియన్ షిప్ లో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 90 శాతం, రిజర్వ్ ఆటగాళ్లకు 87.5 శాతం కోత (ఆటగాళ్లకు రూ.40 వేల నుంచి రూ.10 వేలు) విధిస్తోందట. ఆటగాళ్లకు 5 స్టార్ హోటల్ వసతులను కూడా తగ్గించి.. ఎకానమీ హోటళ్లతో సర్దుకోవాలని బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇదికూడా అధికారిక సమాచారం లేకుండానేనట. దీంతో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ వ్యతిరేకించారని తెలిపింది. మరోసారి అంచనా వేయాలని బోర్డు దేశీయ క్రికెట్ విభాగాన్ని ఆదేశించారని సమాచారం.