Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ క్రికెట్ కు మరో షాక్.. ఇక దివాళానే?

బంగ్లాదేశ్ తో మ్యాచ్ వర్షంతో రద్దవడంతో పాకిస్థాన్ కు విజయం అనేదే లేకుండా పోయింది.

By:  Tupaki Desk   |   2 March 2025 5:00 AM IST
పాకిస్థాన్ క్రికెట్ కు మరో షాక్.. ఇక దివాళానే?
X

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం దక్కినందుకు సంతోషించాలో..? సొంతగడ్డపై ఆడుతూ కనీసం సెమీస్ కు కూడా చేరే అవకాశం లేనందుకు బాధపడాలో తెలియని పరిస్థితి పాకిస్థాన్ ది.

బ్యాట్స్ మన్ ఫామ్ లో లేరు.. బౌలర్లు పదునుగా లేరు.. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఇంటికి పరిమితమైంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ వర్షంతో రద్దవడంతో పాకిస్థాన్ కు విజయం అనేదే లేకుండా పోయింది.

జట్టు ఓడిపోవడంతో పాటు స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీపై వర్షం ప్రభావం పడడంతో ఆదాయం తగ్గింది. మూలిగే నక్కపై తాటిపండులాగా ఇప్పుడు మరో ప్రమాదం పాకిస్థాన్ కు పొంచి ఉంది. అది కూడా భారీ ఆదాయం వచ్చే మార్గంపై కావడం గమనార్హం.

అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఈ నెల 22 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఐపీఎల్ తొలి సీజన్ లో పాక్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. కానీ, ముంబై దాడుల తర్వాత వారికి ఈ లీగ్ లో చాన్స్ లేకపోయింది. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పేరిట సొంతంగా లీగ్ నిర్వహిస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).

తాజాగా పీఎస్ఎల్ కు సంబంధించిన 10వ సీజన్ షెడ్యూల్ ను విడుదల చేసింది పీసీబీ. ఇది ఏప్రిల్ 11 నుంచి మే 18 మధ్య జరగనుంది. ఇందులో ఆరు జట్లు 34 మ్యాచ్ లు ఆడతాయి.

వాస్తవానికి ఐపీఎల్ ను తట్టుకోలేక పీఎస్ఎల్ ను ఏటా ఫిబ్రవరి, మార్చిలోనే నిర్వహిస్తోంది పీసీబీ. కానీ, ఈసారి చాంపియన్స్ ట్రోఫీ అడ్డు రావడంతో పీఎస్ఎల్ ను పోస్ట్ పోన్ చేసింది. కానీ, మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలుకానుండడంతో ఆ ప్రభావం పీఎస్ఎల్ మీద పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ లీగ్ ను ఎవరూ పట్టించుకోరని స్పష్టం అవుతోంది.

చాంపియన్స్ ట్రోఫీలో ఘోర ఓటమితో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. పీఎస్ఎల్ ఆదాయానికి గండిపడనుండడంతో బిక్కమొహం వేసే పరిస్థితి.

ఇప్పటికే పాకిస్థాన్ బోర్డు ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఇక దివాళానే..?