పాక్ క్రికెట్ బోర్డును మూసివేస్తారా? 4 నెలలుగా జీతాల్లేవ్ మరి..
టి20 ప్రపంచ కప్ లో అమెరికా వంటి పసికూన చేతిలోనూ ఓటమి.. ఉప ఖండంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కూ చేరలేనంతగా దారుణ ప్రదర్శన..
By: Tupaki Desk | 4 Oct 2024 2:30 PM GMTటి20 ప్రపంచ కప్ లో అమెరికా వంటి పసికూన చేతిలోనూ ఓటమి.. ఉప ఖండంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కూ చేరలేనంతగా దారుణ ప్రదర్శన.. టెస్టుల్లో చూస్తే ఎన్నడూ లేనివిధంగా స్వదేశంలో తొలిసారిగా పది వికెట్ల తేడాతో ఓటమి.. బంగ్లాదేశ్ వంటి జట్టు చేతిలో 0-2తో సిరీస్ ఓటమి.. ఇదీ గత ఏడాది కాలంలో ఓ జట్టు పరిస్థితి. జట్టే ఇలా ఉందంటే. ఆ దేశ క్రికెట్ బోర్డు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇదంతా పొరుగు దేశం గురించి..
ఇక దివాలానే..
పాకిస్థాన్ క్రికెట్ అంటనే మహా అనిశ్చితి.. క్రికెట్ బోర్డులోనేమో రాజకీయాలు.. ఆటగాళ్లమో క్రమశిక్షణ పాటించరు.. ప్రతిభావంతులకేమో చోటు దక్కదు.. నెపోటిజం మాత్రం మహా ఎక్కువ.. ఇప్పుడు తాజాగా మరో విషయం బయటపడింది. ఆ దేశ క్రికెట్ బోర్డు దివాలా తీసిందట.. ఇక జట్టు పరిస్థితి చూస్తుంటే వరుసగా పరాజయాలు. ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్ చేతిలో ఓటమి అనంతరం టెస్టు కెప్టెన్సీకి బాబర్ ఆజామ్ రాజీనామా చేశాడు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో మార్పులు చేస్తుండడంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జీతాలేవీ బోర్డు పెద్దలూ..
పాకిస్థాన్ జాతీయ క్రికెటర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవట. బోర్డు దివాలా అంచున ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. పాక్ జాతీయ జట్టులో అత్యంత కీలకం బాబర్ అజామ్, వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది. వీరికే జీతాలు లేవట. మహిళా క్రికెటర్లకూ వేతనాలు అందడం లేదట. కాగా, నిరుడు జూలై నుంచి 2026 జూన్ 30 వరకు దాదాపు 25 మందికి పాక్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే, ఇటీవల ప్రదర్శన అత్యంత అధ్వానంగా ఉండడంతో కాంట్రాక్ట్ లను సమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.
వన్డే ప్రపంచకప్ నకు ముందు సీనియర్ క్రికెటర్లు బోర్డుపై ఒత్తిడి పెట్టి అనుకూలంగా కాంట్రాక్ట్ లను దక్కించుకున్నారట. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నెల జీతాలు కూడా రావడం లేదట. జూలై నుంచి జీతాలు లేవని బోర్డు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందనే కథనాలు వస్తున్నాయి.
జెర్సీలపై లోగోల డబ్బూ లేదు
పాకిస్థాన్ క్రికెటర్ల జెర్సీలపై లోగో వేసుకున్నందుకు చెల్లించాల్సిన స్పాన్సర్ షిప్ పేమెంట్ కూడా బకాయిగానే ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కాంట్రాక్ట్ లను పునఃసమీక్షించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. పాక్ మాజీ వికెట్ కీపర బ్యాటర్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ తమ జట్టు ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించాడు.