Begin typing your search above and press return to search.

ఈ పాకిస్తాన్ టీం ఎప్పటికీ మారదు పో.. సొంతగడ్డపై ఈ చెత్త ఆటేందీ సామీ!

చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలవడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   20 Feb 2025 5:09 AM GMT
ఈ పాకిస్తాన్ టీం ఎప్పటికీ మారదు పో.. సొంతగడ్డపై ఈ చెత్త ఆటేందీ సామీ!
X

పాకిస్తాన్ క్రికెట్ టీం.. అనిశ్చితికి మారుపేరు.. ఒకానొక సమయంలో బలమైన ఆస్ట్రేలియాను ఓడించేస్తారు.. మరో సమయంలో పసికూన బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోతారు.. ఇప్పుడూ అదే జరిగింది. ఒకసారి అంటే ఓర్చుకోవచ్చు.. అది సొంతగడ్డపై.. తెలిసిన మైదానాలు, అనుకూల వాతావరణంలో కూడా న్యూజిలాండ్ పై వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది పాకిస్తాన్. ముందు త్రైపాక్షిక సిరీస్ లో ఓడి టైటిల్ చేజార్చుకుంది. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలోనూ న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్ లో ఓడిపోయింది.. సొంతగడ్డపై పాక్ ఓటమిని అక్కడి మాజీలు తట్టుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ టీంలో సత్తా లేదని.. చావు చచ్చారంటూ రమీజ్ రాజా లాంటి వారు కామెంట్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలవడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత గడ్డపై కూడా విజయం సాధించలేకపోతున్న పాక్ క్రికెట్ జట్టు సామర్థ్యంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

పాకిస్తాన్ జట్టు ఆటతీరుపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విఫలం కావడం, బౌలింగ్ లో అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలడం, పాకిస్తాన్ బౌలర్లు సొంతగడ్డపై తేలిపోవడమే ఓటమికి దారితీసింది.

ముఖ్యంగా స్టార్ బ్యాటర్ బాబర్ అజాం తొలి పవర్ ప్లేలో ఆడడానికి తంటాలు పడ్డాడు. 10 ఓవర్లలో జట్టు స్కోరు 30 దాటలేదంటే ఎంత ఘోరంగా బ్యాటింగ్ చేశారో అర్థమవుతోంది. రిజ్వాన్ తేలిపోయాడు. మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఇంత జిడ్డు బ్యాటింగ్ తో టీం ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఆదివారం దుబాయ్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎలా గెలుస్తుందనే ప్రశ్న అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. సొంత గడ్డపై కూడా ఫామ్‌లో లేకపోతే, భారత్ లాంటి బలమైన జట్టును దుబాయ్‌లో ఎలా ఎదుర్కొంటారు? అంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

పాక్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలంటే తక్షణమే తమ స్ట్రాటజీలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన ప్రణాళిక, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకుంటే, భవిష్యత్తులో మరిన్ని పరాజయాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఈ ఓటమి తర్వాత పాక్ జట్టు ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో, దుబాయ్‌లో టీమిండియాతో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి!