Begin typing your search above and press return to search.

మా పతనానికి భారత్ 'బంతి వేసింది'.. పాక్ మాజీ కెప్టెన్ అక్కసు

చరిత్రలోనే తొలిసారి స్వదేశంలో పది వికెట్ల తేడాతో ఓడింది.

By:  Tupaki Desk   |   26 Aug 2024 10:15 AM GMT
మా పతనానికి భారత్ బంతి వేసింది.. పాక్ మాజీ కెప్టెన్ అక్కసు
X

ఉప ఖండంలో ఆడుతూ ఒక్క స్పిన్నర్ ను కూడా తుది జట్టులో తీసుకోకపోవడం తప్పు.. సొంతగడ్డపై ఆడుతూ అతి విశ్వాసానికి ఆడడం తప్పు.. జట్టులోని మేటి బ్యాట్స్ మన్ అద్భుత సెంచరీతో ఆడుతుండగా డిక్లేర్ చేయడం పెద్ద తప్పు.. అసలు బ్యాట్స్ మన్ గానే తగనివాడిని కెప్టెన్ గా చేయడం ఇంకా తప్పు.. ఇన్ని తప్పులను పెట్టుకుని పాకిస్థాన్ మొన్న బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ ఆడింది. చరిత్రలోనే తొలిసారి స్వదేశంలో పది వికెట్ల తేడాతో ఓడింది. బంగ్లాపై సొంతగడ్డలో ఓడడం కూడా ఇదే మొదటిసారి. కానీ.. దీనికి భారత్ ను నిందిస్తున్నాడు పాకిస్థాన్ మాజీ ఓపెనర్.

అప్పటినుంచే కష్టాలట..

మొన్నటి టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ అనామక అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది.. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ లో కనీసం నాలుగు మ్యాచ్ లైనా గెలవలేకపోయింది. ఇక టెస్టుల్లో అయితే ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడింది. తాజాగా బంగ్లాదేశ్ పైనా చేతులెత్తేసింది. కానీ.. అసలు సమస్య ఏమిటో గుర్తించడం లేదు. పైగా బంగ్లా చేతిలో పాక్ ఓటకి పరోక్షంగా భారత్‌ కారణమని మాజీ ఓపెనర్ రమీజ్ రజా దెప్పిపొడుస్తున్నాడు. దీంతో అతడిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. క్రికెట్ లో పాక్ ఓడినా.. గెలిచినా భారత్ ను ప్రస్తావించడం పాక్ మాజీలకు అలవాటేనని మండిపడుతున్నారు. గత ఆసియా కప్‌లో పాక్ పేసర్లపై భారత బ్యాట్స్ మెన్ ఆధిపత్యం ప్రదర్శించిన దగ్గరినుంచి మిగతా జట్ల వారు అందరూ అలవోకగా ఎదుర్కొంటున్నారని రమీజ్ నిష్టూరమాడాడు. ఆసియా కప్ లో సీమ్ కు అనుకూలంగా ఉన్న పిచ్‌ లపైన కూడా పాక్‌ బౌలర్లు తేలిపోయారని దీంతో ఆ తర్వాత ఇతర జట్లూ తమ బౌలింగ్‌ ను సలువుగా ఆడేస్తున్నాయని రమీజ్ అన్నాడు. పాక్ పేసర్ల లో వేగం తగ్గిపోయిందని.. నైపుణ్యం కూడా మరింత మెరుగవ్వాల్సి ఉందని పేర్కొన్నాడు.

అసలు సమస్య ఇది..

పాకిస్థాన్ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. తుది జట్టులో స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడమే బంగ్లాతో మ్యాచ్ లో ఓటమికి కారణం. పాక్ రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా స్పిన్నర్లు 8 వికెట్లు తీశారు. ఇక పాక్ ముగ్గురు పేసర్లూ ఆకట్టుకోలేదు. వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిందని రమీజ్ చెప్పాడు. ఇక షాన్ మసూద్ ను కెప్టెన్ చేయడం పెద్ద బ్లండర్. అతడు పిచ్‌ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వన్ డౌన్ లో దిగుతున్న అతడు బ్యాటర్‌ గానూ విఫలమయ్యాడు. వీటన్నిటినీ రమీజ్ రాజా అంగీకరించడం గమనార్హం. అలా చేస్తూనే భారత బ్యాట్స్ మెన్ కారణంగా తమ పేస్ బౌలర్లు లయ తప్పారని నిందిస్తున్నాడు. కాగా, ఐదేళ్లుగా పాక్‌ క్రికెట్‌ ను నాశనం చేస్తున్నారని మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఆరోపించాడు.

జింబాబ్వేతోనూ ఓడిపోయిన సంగతిని గుర్తుచేశాడు. ఇదే సమయంలో స్వదేశంలో అల్లర్లు జరుగుతూ.. సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ బంగ్లా ఆటగాళ్లు తెగువతో ఆడి గెలిచారని కొనియాడాడు. వారి ఆట.. పాక్ క్రికెట్ పతనాన్ని బాహ్య ప్రపంచానికి చాటిందని.. క్లబ్‌ క్రికెటర్లే తమ జాతీయ జట్టు ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఆడతారని ధ్వజమెత్తాడు.