భారత్ లో భారత్ ను.. భారత్ లో పాక్ నూ ఓడించలేరు.. పాక్ దిగ్గజ పేసర్
పాకిస్థాన్ ఫేవరెట్ ప్రపంచ కప్ టైటిల్ ఫేవరెట్లలో పాకిస్థాన్ కూడా ఒకటని అక్తర్ పేర్కొన్నాడు.
By: Tupaki Desk | 9 Sep 2023 1:30 PM GMTఒకప్పుడు జావెద్ మియాందాద్.. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది.. టీమిండియా అంటే చిటపటలాడేవారు. వారి తర్వాత అంత వైరం కొనసాగించిన పాకిస్థాన్ ఆటగాళ్లు లేరు. అయితే, మైదానంలో పోటీపరంగా ఓ పేసర్ మాత్రం గట్టిగా నిలిచాడు. అతడిని ఎదుర్కొనడం ఓ దశలో టీమిండియా అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ కు కత్తిమీద సామే అయింది. అతడు పూర్తి ఫిట్ గా ఉండి మెరుపు వేగంతో బంతులేస్తే ఎంతటి బ్యాట్స్ మన్ అయినా కంగుతినాల్సిందే. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కే ఈ విషయం అర్థమైంది.
పాకిస్థాన్ క్రికెటర్లలో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న పేసర్ షోయబ్ అక్తర్. 1998 ప్రాంతంలో అతడి అరంగేట్రం నుంచే సంచలనం. సోషల్ మీడియా కాదు కదా..? మీడియానే ఇంతగా లేని ఆ కాలంలోనూ అక్తర్ పేరు మార్మోగింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో 1999లో జరిగిన టెస్టులో సచిన్, ద్రవిడ్ ను వరుస బంతుల్లో ఔట్ చేసిన విధం చూసి తీరాల్సిందే.
కాగా, 2003 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో సచిన్ -సెహ్వాగ్ ద్వయం అక్తర్ ను ఎదుర్కొన్న తీరును చెప్పేందుకు మాటలు చాలవు. నాటి మ్యాచ్ లో వారు కొట్టిన అప్పర్ కట్ లు ఎప్పటికీ గుర్తుంటాయి. కాగా, అక్తర్ 2011లో రిటైరయ్యాక కామెంటేటర్ గా స్థిరపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ లో విశ్లేషణలు చేస్తున్నాడు. భారత్ వేదికగా వచ్చే నెల 5 నుంచి జరిగే వన్డే ప్రపంచ కప్ పై అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్ ఫేవరెట్ ప్రపంచ కప్ టైటిల్ ఫేవరెట్లలో పాకిస్థాన్ కూడా ఒకటని అక్తర్ పేర్కొన్నాడు. తమ జట్టు స్పిన్ విభాగం బలహీనంగా ఉందని, స్పిన్ ఆల్‌రౌండర్ లేడని తెలిపాడు. అయితే, టీమిఇండియాను భారత్‌లో ఓడించడం అసాధ్యమని పేర్కొన్నాడు. తమ జట్టులోని స్పిన్నర్ షాదాబ్ ఖాన్ మంచి బౌలరే అయినా ఆల్ రౌండర్ లేని లోటు మాత్రం తీరలేదన్నాడు. కాగా, ఆసియా కప్ లోనూ పాక్ ను ఫేవరెట్ గానే అక్తర్ తెలిపాడు.
భారత్ లో పాక్ నూ ఓడించలేం..భారత్ లో భారత్ ను ఓడించడం ఎంత కష్టమో.. భారత్ లో పాకిస్థాన్ ను ఓడించడం కూడా అంతే కష్టమని అక్తర్ విశ్లేషించాడు. రెండు జట్లలో మంచి పేసర్లు ఉండడమే దీనికి కారణమని తెలిపారు. అయితే, భారత స్పిన్ విభాగం బలంగా ఉందని కొనియాడాడు. అన్నిటికి మించి ప్రపం చ కప్ నకు ముందు ఇరు జట్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయని చెప్పాడు. పాక్ బ్యాటింగ్ గతంలో బలహీనంగా ఉండేదని.. ఇప్పుడు బలమైన బ్యాటింగ్ లైనప్ ఏర్పడిందని తెలిపాడు. "వారిని ఔట్ చేయడం అంత తేలిక కాదు" అని చెప్పుకొచ్చాడు.