Begin typing your search above and press return to search.

చిరకాల ప్రత్యర్థిని ఓడించిన హైదరాబాదీ బిర్యానీ..

ప్రపంచంలోని ఎక్కడివారైనా సరే.. ఏ రంగానికి చెందినవారైనా సరే.. హైదరాబాద్ బిర్యానీ అంటే నాలుక కోసేసుకుంటారనడంలో సందేహం లేదు.. వివిధ పర్యటనలకు వచ్చే వారు భాగ్య నగర బిర్యానీని టేస్ట్ చేసి మరీ వెళ్తారు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:18 PM GMT
చిరకాల ప్రత్యర్థిని ఓడించిన హైదరాబాదీ బిర్యానీ..
X

ప్రపంచంలోని ఎక్కడివారైనా సరే.. ఏ రంగానికి చెందినవారైనా సరే.. హైదరాబాద్ బిర్యానీ అంటే నాలుక కోసేసుకుంటారనడంలో సందేహం లేదు.. వివిధ పర్యటనలకు వచ్చే వారు భాగ్య నగర బిర్యానీని టేస్ట్ చేసి మరీ వెళ్తారు. బాలీవుడ్ సహా భారత్ లోని ఏ రాష్ట్ర సినీ రంగ ప్రముఖులనైనా అడగండి..? హైదరాబాద్ లో వారి ఫేవరెట్ ఏమిటంటే బిర్యానీ అనే చెబుతారు. బిజినెస్ మెన్ లు, క్రికెటర్లు ఇలా మరే ఇతర రంగం వారైనా సరే.. హైదరాబాద్ లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏదంటే బిర్యానీ అని లొట్టలేస్తారు. ఇలానే నోరూరిందేమో? ఆ చిరకాల ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కూడా..? దాని ఫలితంగానే తాము ఓటమి పాలయ్యామంటూ వాపోతున్నారు.

భారత్ ఏకైక వేదికగా గురువారం వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది. అన్ని దేశాలు దీనికి సిద్ధమయ్యాయి. దాదాపు అన్ని జట్లూ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాయి.. ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లను వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లు దక్కని నగరాలకు కేటాయించారు. తద్వారా ఏ నగరానికీ అన్యాయం చేయలేదన్న పేరు మిగుల్చుకునేందుకు బీసీసీఐ ప్రయత్నం చేసింది.

ప్రపంచ కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లను ఉప్పల్ మైదానానికి కేటాయించలేదు. పాకిస్థాన్ కు మాత్రం ఇక్కడ రెండు మ్యాచ్ లు కేటాయించారు. ఈ నెల 6న నెదర్లాండ్స్ ను, 12న శ్రీలంకను ఉప్పల్ లోనే ఎదుర్కోనుంది. కాగా, లీగ్ దశలో రెండు మ్యాచ్ లు ఆడనున్న పాకిస్థాన్ కు ఉప్పల్ లో ప్రాక్టీస్ అవకాశం కల్పించారు. దాదాపు రెండు వారాలు పాక్ జట్టు హైదరాబాద్ లో ఉండనుంది.

మన బిర్యానీ అంటే మాటలా..?

భారత్ లో కాలుపెట్టినప్పటి నుంచి పాకిస్థాన్ హైదరాబాద్ లోనే ఉంది. ఇక ఉప్పల్ లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా ఆడింది. అయితే ఈ రెండింటిలోనూ ఓడింది. అయితే, దీనికి కారణం హైదరాబాద్ బిర్యానీ అంటున్నాడు ఆ జట్టు ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్. హైదరాబాద్ బిర్యానీ తింటూ వస్తున్న ప్లేయర్లు మైదానంలో కొంచెం బద్ధకిస్తున్నారని చెబుతున్నాడు. కాగా, పాకిస్థాన్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో సన్నాహక మ్యాచ్ లు ఆడింది. వాటిలో ఆసీస్ తో మ్యాచ్ కు షాదాబ్ కెప్టెన్ గానూ వ్యవహరించడం గమనార్హం. రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లలోనూ ఓటమి ఎదురవడంపై అతడు స్పందించాడు.

‘ఫలితాలు ముఖ్యం కాదు. మేము చాలా నేర్చుకున్నాం. మా ఆట బాగుంది, ఫలితం మా చేతుల్లో లేదు. మా ప్లేయింగ్ ఎలెవన్ కుదిరింది, బెంచ్‌కి పరిమితమైన ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లతో ఆడితే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడి పరిస్థితులపై కూడా కొంత అవగాహన ఏర్పడింది’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బిర్యానీపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘రోజూ హైదరాబాద్ బిర్యానీ తింటున్నాం. అందుకే కొంచెం నెమ్మది అవుతున్నాం అనుకుంటున్నా’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. మరోవైపు శుక్రవారం ఉప్పల్ లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ద్వారా పాక్ ప్రపంచ కప్ సమరం మొదలుపెడుతుంది.

కొసమెరుపు : పాకిస్థాన్ జట్టులో నాణ్యమైన ఆల్ రౌండర్ లేరు. ఆ లోటును తీరుస్తాడని షాదాబ్ ఖాన్ పై ఆశలున్నాయి. అయితే, అతడు అంచనాలను అందుకోలేకపోతున్నాడు. దీంతో ఇటీవల పేసర్ షహీన్ షా ఆఫ్రిదిని వైస్ కెప్టెన్ గా నియమించారు. తర్వాత మళ్లీ షాదాబ్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు.