టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ది పెద్ద గాయమే? 2023లో ఆడడు
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ విషయంలో ఈ స్థాయిలో కాకున్నప్పటికీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇలాంటి గందరగోళమే రేపిందనేది తెలుస్తోంది.
By: Tupaki Desk | 10 Nov 2023 10:45 AM GMTఆటగాళ్ల గాయాల విషయంలో క్రికెట్ బోర్డులు కొన్నిసార్లు నిజాలు చెప్పడం లేదా? అనిపిస్తుంటుంది. ఈ సంగతి అన్ని దేశాల బోర్డులకూ వర్తిస్తుంది. గాయం తీవ్రతను అంచనా వేయకపోవడం.. గాయం తగ్గకుండానే ఎంపిక చేయడం.. తుది జట్టులోనూ చోటు కల్పించడం.. ఇలా ఎన్నో పొరపాట్లు చేస్తుంటాయి. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ విషయంలో ఈ స్థాయిలో కాకున్నప్పటికీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇలాంటి గందరగోళమే రేపిందనేది తెలుస్తోంది.
అతడు అత్యంత కీలకం
టీమిండియాలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. అతడి ఫీల్డింగ్, లోయరార్డర్ లో బ్యాటింగ్, మూడో పేసర్ అందించే సేవలు అన్నీ కీలకమే. అయితే , ఈ ప్రపంచ కప్ హార్దిక్ కు కలిసిరాలేదు. కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడగలిగాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. బంతిని డెలివరీ చేసిన తర్వాత ఫాలో త్రూలో కిందపడ్డాడు. పూర్తి భారం ఎడమ కాలిపై పడడంతో హార్దిక్ మరిక బౌలింగ్ చేయలేపోయాడు. ఆ తర్వాత మ్యాచ్ మొత్తానికే దూరమయ్యాడు. మొదట రెండు మ్యాచ్ లు అని.. మూడు మ్యాచ్ లని చెప్పినప్పటికీ అతడి గాయం తీవ్రతతో పునరాగమనం సాధ్యంకాదని స్పష్టమైంది. కానీ, క్రికెట్ బోర్డు మాత్రం హార్దిక్ పాండ్యా సెమీఫైనల్స్ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడంటూ ప్రకటనలు ఇచ్చింది. తీరా చూస్తే హార్దిక్ ప్రపంచ కప్ టోర్నీకే దూరమయ్యాడు. అతడి స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణను ఎంపిక చేశారు.
ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కూ లేడు
ప్రపంచ కప్ ఫైనల్స్ ఈ నెల 19వ తేదీతో ముగియనుంది. ఆ వెంటనే నాలుగు రోజులకు ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ జరగనుంది. దీనికోసం ఈ నెల 15న భారత్ ఆడనున్న మొదటి సెమీఫైనల్స్ ముగిసిన అనంతరం జట్టును ప్రకటించనున్నారు. అయితే, టి20లకు కొంతకాలంగా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పరిగణించడం లేదు. ఆల్ రౌండర్ హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అతడు ఆస్ట్రేలియా సిరీస్ కూ దూరమయ్యాడు. గాయం తీవత్రనే దీనికి కారణం. కాగా ఆసీస్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ ఈ నెల 23న ఉంది. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లేదా రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇస్తారని చెబుతున్నారు. సూర్య ఇప్పటికే టి20 జట్టుకు వైస్ కెప్టెన్. అయితే, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
ఎందుకింత గందరగోళం.. షమీ లేకుంటే?
టీమిండియాకు హార్దిక్ అవసరం చాలా ఉంది. అతడు గాయపడడంతో కాస్త ఆందోళన వ్యక్తమైంది. మరో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో తప్పనిసరై మొహమ్మద్ షమీని తీసుకోవాల్సి వచ్చింది. షమీ అద్భుతంగా రాణించడంతో హార్దిక్ లేని లోటు తెలియలేదు. అయితే, ఇక్కడ విషయం ఏమంటే... హార్దిక్ గాయంపై క్రికెట్ బోర్డు చేసిన ప్రకటనలే. గాయం అంచనా వేసిన తర్వాత కానీ.. హార్దిక్ అందుబాటు విషయమై ప్రకటనలు చేయకుండా ముందే స్పందించింది. ఒకవేళ షమీ విఫలమై.. హార్దిక్ ను బలవంతంగా ఆడించి ఉంటే పరిస్థితి ఏమిటి? కాగా, ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి హార్దిక్ పాండ్యా గాయం తీవ్రమైనదే అని తెలుస్తోంది. అతడికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని చెబుతున్నారు. అంటే.. 2023లో హార్దిక్ మళ్లీ మైదానంలో దిగడం కష్టమేనేమో?