నాటి నరకయాతన గుర్తుచేసుకున్న పంత్... కీలక వ్యాఖ్యలు!
ఇలా ఐపీఎల్ సీజన్ 17లో చుపించిన పెర్ఫార్మెన్స్ ఫలితంగా టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
By: Tupaki Desk | 28 May 2024 4:30 PM GMTఘోర ప్రమాదం, సుధీర్ఘ విరామం అనంతరం తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మైదానంలోకి అడుగుపెట్టాడు భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 40.55 యావరేజ్ తో 446 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉండగా.. 88 అత్యధిక స్కోరు. ఇలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇచ్చిన రీ ఎంట్రీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించాడు.
ఇలా ఐపీఎల్ సీజన్ 17లో చుపించిన పెర్ఫార్మెన్స్ ఫలితంగా టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్.. తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు. అన్ని నెలల పాటు అనుభవించిన నరకయాతనను పంచుకున్నాడు.
అవును... ఇటీవల ఓ షోలో పాల్గొన్న పంత్... రోడ్డు ప్రమాదం అనంతరం తాను అనుభవించిన ఇబ్బందులను, భరించలేని బాధలను గురించి పంచుకున్నాడు. ఇందులో భాగంగా... రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని చాలా మార్చిందని.. ఆ సమయం తనకు ఎంతో అనుభవాన్ని నేర్పిందని తెలిపారు.
ఇక నాడు తగిలిన తీవ్ర గాయాల వల్ల ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించిందని చెప్పిన పంత్... ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించినట్లు తెలిపారు. అది తనకు నరకంగా అనిపించిందని.. వీల్ ఛైర్ లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేదని.. కానీ... చివరకు భగవంతుడు రక్షించాడని అన్నారు.
కాగా... డిసెంబరు 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల సుమారు 15 నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అభిమానుల ఆదరణ గెలుచుకున్నాడు!