దుబాయ్ లో టీమ్ ఇండియా మ్యాచ్ లు.. కమ్మిన్స్ వ్యాఖ్యలు వక్రీకరణ
భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ కు వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Feb 2025 11:30 PM GMTభద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ కు వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో టీమ్ ఇండియా మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతున్నాయి. భారత్ వంటి జట్టుకు ఇలాంటి అవకాశం ఇవ్వడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైక్ అథర్టన్, నాసిర్ హొస్సేన్ లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
వీరిద్దరికీ తోడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరగడంపై అభ్యంతరం తెలిపినట్లు కథనాలు వచ్చాయి. టీమ్ ఇండియా భారీ ప్రయోజనం పొందుతోంది అన్నట్లు అతడు మాట్లాడాడనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఒక దశలో భారత్ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకుంటే టోర్నీనే సందిగ్ధంలో పడే పరిస్థితి వచ్చింది. అలాంటి దశ నుంచి టోర్నీ కొనసాగడం మంచిదనేని కమ్మిన్స్ పేర్కొన్నాడు. అయితే, మ్యాచ్ లన్నీ ఒకే వేదికపై ఆడడం భారత్‌కు భారీ ప్రయోజనం అని.. పటిష్ఠ జట్టుకు ఇలాంటి ఫేవర్ సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా అరుదైన రికార్డు అందుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్. ఇటీవలి భారత్ తో టెస్టు సిరీస్ లోనూ కెప్టెన్సీ చేసిన అతడు.. ఆ తర్వాత గాయంతో శ్రీలంక పర్యటనతో పాటు చాంపియన్స్ ట్రోఫీకీ దూరమయ్యాడు. అయితే, టోర్నీలో భారత్ కు మేలు చేకూరుతుందంటూ అతడు చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు కాస్త దుమారం రేపాయి.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, నాసిర్ హుస్సేన్ రిటైరైనవారు. కమ్మిన్స్ అలా కాదు కదా..? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత భారీ ధర రూ.20 కోట్లకు పైగా అందుకునే కమ్మిన్స్ భారత జట్టు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
కానీ, దుబాయ్ లో మ్యాచ్ లతో భారత జట్టుకు ప్రయోజనం అంటూ ఎలాంటి వ్యాఖ్యలను తాను చేయలేదని కమిన్స్ పోస్టు చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మీడియా ప్రచురించిన తప్పుడు వార్త వల్లే ఇదంతా జరిగినట్లు వివరణ ఇచ్చాడు.