Begin typing your search above and press return to search.

కోహ్లి..నువ్ డెడ్ స్లో..చాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఆసీస్ స్లెడ్జింగ్

ఇప్పుడు మరింత ఆసక్తి కలిగించేలా మరో అప్ డేట్ వచ్చింది. అది కూడా క్రికెట్ లో స్లెడ్జింగ్ కు పేరుగాంచిన ఆస్ట్రేలియా నుంచి కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   5 Feb 2025 9:14 AM GMT
కోహ్లి..నువ్ డెడ్ స్లో..చాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఆసీస్ స్లెడ్జింగ్
X

మరొక్క రెండు వారాల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ తర్వాత అంత ముఖ్యమైనది ఈ టోర్నీ. పైగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. 2017లో తరహాలోనే వన్డే ఫార్మాట్ లోనే టోర్నీ జరగనుంది. మరోవైపు గత టోర్నీలో ఫైనలిస్టులు భారత్-పాకిస్థాన్. నాడు టీమ్ ఇండియాను అనూహ్యంగా ఓడించింది పాక్.

ఇక పాకిస్థాన్ కు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహించే అవకాశం దక్కింది. కానీ, పొరుగు దేశానికి వెళ్లేందుకు టీమ్ ఇండియాకు అనుమతి దక్కలేదు. దీంతో ఓ దశలో టోర్నీనే రద్దవుతుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు భారత్ మ్యాచ్ లు తటస్థ వేదిక అయిన దుబాయ్ లో జరిగేందుకు పాకిస్థాన్ అంగీకరించడంతో కథ సుఖాంతం అయింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పర్యవేక్షణలో ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. టోర్నీపై ఆసక్తి కలిగించేలా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య జరిగిన గత మ్యాచ్ ల ఆసక్తికర వీడియోను రూపొందించారు. గత వారమే దీని ట్రైలర్ విడుదలైంది.

ఇప్పుడు మరింత ఆసక్తి కలిగించేలా మరో అప్ డేట్ వచ్చింది. అది కూడా క్రికెట్ లో స్లెడ్జింగ్ కు పేరుగాంచిన ఆస్ట్రేలియా నుంచి కావడం గమనార్హం. భారత స్టార్‌ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కాలు దువ్వాడు.

కోహ్లి.. ఇటీవల ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో, రంజీ ట్రోఫీలోనూ విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ తో వన్డే సిరీస్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి సిద్ధం అవుతున్నాడు.

అయితే, అతడిని ఉద్దేశిస్తూ కమిన్స్ టీజ్‌ చేశాడు. ఆ వీడియోలు వైరల్‌ గా మారాయి. గత పర్యటనలో కోహ్లిని కమ్మిన్స్ ఏమీ అనలేదు కదా..? ఇదెప్పుడు జరిగింది? అనుకోకండి.. ఇది చాంపియన్స్‌ ట్రోఫీ కోసం తీసిన అడ్వర్టయిజ్ మెంట్ వీడియో. ఇందులో కమిన్స్‌ షేవ్ చేసుకుంటూ అద్దంలో చూస్తూ.. ‘హాయ్ కోహ్లి. నువ్వు ఇప్పటివరకు ఇంత నెమ్మదిగా ఆడడం చూడలేదు. చాలా నెమ్మదిగా ఆడావు’ అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు

కాగా చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19 నుంచి మొదలుకానుంది. ఇందులో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో కూడిన ఆస్ట్రేలియా కఠినమైన గ్రూప్ లో ఉంది. ఇప్పటికే కీలక ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయంతో దూరమయ్యాడు. ఇప్పుడు కమ్మిన్స్ కూడా గాయంతో తప్పుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కంగారూలకు షాకే.