నాడు టాస్ గెలిచి బౌలింగ్.. నేడు టాస్ గెలిచి బ్యాటింగ్.. తప్పులో కమ్మిన్స్ కాలు
నిరుడు అక్టోబరు-నవంబరులో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అప్రతిహత విజయాలతో ఫైనల్ చేరింది.
By: Tupaki Desk | 28 May 2024 11:39 AM GMTనిరుడు అక్టోబరు-నవంబరులో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అప్రతిహత విజయాలతో ఫైనల్ చేరింది. లీగ్ దశలో తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. అలాంటి జట్టే ఫైనల్లోనూ ఎదురుపడింది. వాస్తవానికి ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతుందని మొదట్లో ఎవరూ భావించలేదు. తొలి రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. అఫ్ఘానిస్థాన్ మీద అయితే చచ్చీ చెడి గెలిచి నాకౌట్ కు వచ్చింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేజేతులా ఓడింది. దీంతో ఆస్ట్రేలియా తుది సమరానికి వచ్చింది.
ఆ జట్టు అంటే భయమే..
మిగతా జట్ల కంటే ఆస్ట్రేలియా ఫైనల్ చేరిందంటే కప్ కొట్టేయడం ఖాయం. ఎందుకంటే ఫైనల్ కోసం వారి ప్రణాళిక ప్రత్యేకంగా ఉంటంది. ఏ చిన్న అవకాశం దొరికినా విడిచిపెట్టరు. మ్యాచ్ కోసం పూర్తి ప్రణాళికతో బరిలో దిగుతారు. ఒక్కో ఆటగాడికి ఒక్కో ప్లాన్ వేస్తారు. అందుకే ఆస్ట్రేలియాతో ఫైనల్ అంటే మిగతా జట్లు కాస్త బెదురుతాయి. కాగా, వన్డే ప్రపంచ కప్ ఆఖరి సమరం అహ్మదాబాద్ లోని అతి పెద్ద స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అనూహ్యంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సరిగ్గా 20 ఏళ్ల కిందట దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని భంగపడింది. ఈసారి సీన్ రివర్స్ అవుతుందని, కమ్మిన్స్ తప్పులో కాలేశాడని అందరూ భావించారు. కానీ, మ్యాచ్ సాగేకొద్దీ ఆసీస్ వ్యూహం అర్థమైంది. భారత బ్యాటింగ్ కు పెద్దగా అనుకూలించని పిచ్.. ఆస్ట్రేలియా ఛేజింగ్ కు వచ్చాక సాధారణంగా మారిపోయింది. ఫలితంగా టీమిండియాకు ప్రపంచ కప్ దూరమైంది.
ఈసారి మాత్రం బెడిసికొట్టింది..
స్టార్ ఆటగాళ్లు లేక.. స్ధానిక ఆటగాళ్లు సత్తా చాటక కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రదర్శన దిగజారిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇందులో కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్ పాత్ర చాలా ఉంది. ఆటగాళ్లను అతడు ఉపయోగించుకున్న విధానం అలాంటిది. దీంతో సన్ రైజర్స్ ఈ సీజన్ లో అద్భుతాలు సాధించింది. అయితే, వన్డే ప్రంపచ కప్ ఫైనల్లోలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కమ్మిన్స్.. ఐపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. తీరా ఫలితం చూసేసరికి కమ్మిన్స్ నిర్ణయం తప్పని తేలింది. వాస్తవానికి టాస్ గెలిస్తే ముందు బౌలింగా? బ్యాటింగా? అనేది టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం. ఇందులో కెప్టెన్ అభిప్రాయమూ తీసుకుంటారు. అయితే, నిర్ణయం సమష్టిది అయినా.. కెప్టెన్ స్థిరంగా చెబితే కాదనే అవకాశం ఉండదు.
కొసమెరుపు: ‘ఇక్కడున్న లక్షా 20 వేల మంది అభిమానులు మూగబోయేలా చేస్తాం’.. ఇదీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు ముందు కమ్మిన్స్ చేసిన వ్యాఖ్య. అలానే చేశాడు కూడా. కానీ, ఐపీఎల్ ఫైనల్లో దారుణ ఓటమితో హైదరాబాదీలు మూగబోయేలా చేశాడు.