రూ.110 కోట్లు.. 20 మంది ప్లేయర్స్.. మరి ఆ ఫ్రాంచైజీ ఏం చేస్తుంది?
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా వచ్చేసింది.
By: Tupaki Desk | 2 Nov 2024 12:30 PM GMTఅభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా వచ్చేసింది. ఏ జట్టు ఎందరిని తమతో ఉంచుకుందో తేలిపోయింది. మొత్తం పది ఫ్రాంచైజీలు.. నిబంధనల ప్రకారం ఒక్కోటి గరిష్ఠంగా అయిదుగురు అంతర్జాతీయ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. మరో విధంగా చెప్పాలంటే గరిష్ఠంగా తమ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. లేదా వేలంలో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ద్వారా తిరిగి సొంతం చేసుకోవచ్చు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు చొప్పున ఆటగాళ్లను తీసుకున్నాయి కాబట్టి వేలంలో ఆ ఫ్రాంఛైజీలు ఆర్టీఎం వాడటానికి అవకాశం లేదు. ఇక ఆటగాళ్ల రిటైన్, వేలంలో కొనుగోలు కోసం ప్రతి ఫ్రాంఛైజీ గరిష్ఠంగా రూ.120 కోట్లు ఖర్చు పెట్టొచ్చు.
ఫ్రాంచైజీలు ఒక్కోటి ఆరుగురిని గరిష్ఠంగా రిటైన్ చేసుకోవచ్చు అనుకుంటే 60 మంది వరకు అవుతారు. కానీ, 46 మందినే రిటైన్ చేసుకున్నాయి. కోల్ కతా, రాజస్థాన్ అందరినీ అట్టిపెట్టుకున్నాయి. పంజాబ్ మాత్రం ఇద్దరినే రిటైన్ చేసుకుంది. వారిద్దరూ కూడా ఇంతవరకు భారత్ కు ఆడనివారు (అన్ క్యాప్డ్) కావడం గమనార్హం. ఈ ఏడాది మంచి ప్రతిభ కనబర్చిన శశాంక్ సింగ్ ను రూ.5.50 కోట్లకు, ప్రభ్ సిమ్రన్ సింగ్ ను రూ.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇది అత్యంత ఆశ్చర్యకర ఎంపిక అనడంలో సందేహం లేదు.
ఇంకా 110 కోట్లు..
రూ.9.5 కోట్లకు ఇద్దరినే అట్టిపెట్టుకున్న పంజాబ్ వద్ద ఇంకా 110.50 కోట్లు ఉన్నాయి. లీగ్ లో ఏ జట్టు వద్ద కూడా ఇంత మొత్తం లేదు. బెంగళూరు (83 కోట్లు), ఢిల్లీ, లక్నో (73 కోట్లు), గుజరాత్ (69 కోట్లు), చెన్నై (55 కోట్లు), కోల్ కతా (51 కోట్లు), సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ (45 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ.41 కోట్లు) ఇలా ఏది చూసినా అన్నీ పంజాబ్ కంటే వెనుకే ఉన్నాయి. మరి రూ.110 కోట్లతో ఏం చేస్తుందా? అని అంటే.. మెగా వేలానికి వచ్చినవారిని కొనుక్కుంటుంది. ఒక ఐపీఎల్ జట్టులో 22 మంది ఉంటారు. రూ.110 కోట్లతో పంజాబ్ ఇంకా 20 మందిని తీసుకోవాలి. అంటే.. సగటున ఒక్కో ఆటగాడికి రూ.5 కోట్లు వ్యయం చేసేందుకు అవకాశం ఉందన్నమాట.
కెప్టెన్ కూడా..
పంజాబ్ తమ కెప్టెన్ శిఖర్ ధావన్ ను కూడా వదులుకుంది. అంటే.. వచ్చే సీజన్ లో కెప్టెన్ సహా కొత్తవారిని తీసుకోవాల్సిందే. కాగా.. పంజాబ్ కెప్టెన్ గా ఎవరిని తీసుకోవాలన్నా.. కనీసం 15 కోట్లు తక్కువ ఉండదు. తాజాగా లక్నో వదులుకున్న కేఎల్ రాహుల్ గతంలో పంజాబ్ కు ఆడినవాడే. కెప్టెన్ గానూ అనుభవం ఉన్నవాడు. కాబట్టి రాహుల్ పై కన్నేస్తుందేమో ప్రీతి జింటా జట్టు?