ఐసీసీ ని టెన్షన్ పెడుతున్న పాక్... పరువు నిలుపుకుంటుందా?
అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతోంది.
By: Tupaki Desk | 9 Jan 2025 3:40 AM GMTఅత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెలలో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే... పట్టుబట్టి మరీ ఈ టోర్నీకి సంబంధించిన ఆతిథ్యం హక్కులు సంపాదించుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. దీంతో.. ఐసీసీ అందోళన వ్యక్తం చేసిందని చెబుతున్నారు.
అవును... పట్టుబట్టిమరీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్.. భారత్ తమ దేశానికి రావాల్సిందేనని బిల్డప్ ఇచ్చినంత పనిచేసింది! ఆ సంగతి అలా ఉంటే... వచ్చే నెల 19న ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమవుతుండగా.. ఇప్పటివరకూ ఆ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ లు జరగాల్సిన స్టేడియంలు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వలేదని తెలుస్తోంది.
ఇందులో భాగంగా... కరాచిలోని నేషనల్ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియం, లాహోర్ లోని గడాఫీ స్టేడియంలలో జరుగుతున్న ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని.. వీటిలోని డ్రెస్సింగ్ రూమ్ లు, ప్రేక్షకులు కుర్చునే సీట్లు మొదలైన వసతులను పాక్ క్రికెట్ బోర్డు తీర్చిదుద్దుతోన్నట్లు గత కొంతకాలంగా చెబుతోంది.
అయితే... మాటల్లో ఉన్న వేగం చేతల్లో లేదని.. ఇప్పటివరకూ ఆ స్టేడియం లు పూర్తిగా సిద్ధమయేందుకు చాలా దూరంలో ఉన్నాయని.. బేసిక్ సెటప్ కు సైతం ఇంకా చాలా సమయం పట్టేలా ఉందని అంటున్నారట. మరోవైపు ఈ నెల 31లోపు పనులు పూర్తి చేసి, వచ్చే నెల 12లోపు ఈ స్టేడియాలను ఐసీసీకి అప్పగించాలని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డ్ వ్యవహార శైలిపై ఐసీసీ ఆందోళన వ్యక్తం చేస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా.. మరో రెండు వారాల్లో స్టేడియలు పూర్తిస్థాయిలో సన్నధం చేయలేని పక్షంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగా.. ట్రోఫీ నిర్వహణ మొత్తాన్ని దుబాయ్ కు తరలిస్తామని హెచ్చరించిందని అంటున్నారు.
మరి ఐసీసీ చెప్పిన సమయానికే పాక్ క్రికెట్ బోర్డు ఆ మూడు స్టేడియంలను పూర్తి స్థాయిలో రెడీ చేస్తుందా.. లేక, ప్రపంచం ముందు తీవ్ర అవమానానికి గురవుతుందా అనేది వేచి చూడాలి.