Begin typing your search above and press return to search.

ఎత్తు.. నీరు.. ఒంటరి.. చీకటి.. మన క్రికెటర్ల ఫోబియాలు

150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ధైర్యంగా ఎదుర్కొనే వీరు.. చిన్న చిన్న అంశాలంటే భయపడతారట. ఈ విషయాలను వారే స్వయంగా వెల్లడించారు. మరి అవేమిటో చూడండి..

By:  Tupaki Desk   |   1 Dec 2024 12:30 PM GMT
ఎత్తు.. నీరు.. ఒంటరి.. చీకటి.. మన క్రికెటర్ల ఫోబియాలు
X

నీరంటే భయం.. నిప్పంటే.. నేలంటే భయం.. అంటూ ఓ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్ పెద్ద డైలాంగ్ చెబుతారు. ఇలాంటి పరిస్థితిని ‘ఫోబియా..’ అంటారు. దీనికి ప్రత్యేకంగా కారణం ఏమీ ఉండదు. మనసులో ఏదో మూలన ఉన్న ఆందోళనే భయంగా మారుతుంటుంది. అవతలివారికి వినేందుకు కాస్త వింతగా ఉన్నా.. భయపడేవాడికి కదా అసలు సంగతి తెలిసేది. కొందరికి కొన్ని వస్తువులంటే భయం.. ఇంకొందరికి జంతువులంటే భయం.. మరికొందరికి మనుషుల్లోకి వెళ్లాలంటే భయం.. అయితే, దీనికి సామాన్య ప్రజలే కాదు.. మన జాతీయ క్రికెటర్లూ అతీతులు కాదట. అంతర్జాతీయ స్థాయికి ఎదిగి.. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ధైర్యంగా ఎదుర్కొనే వీరు.. చిన్న చిన్న అంశాలంటే భయపడతారట. ఈ విషయాలను వారే స్వయంగా వెల్లడించారు. మరి అవేమిటో చూడండి..

కింగ్ కు విమాన భయం..

ఎంతటి భయంకర బౌలర్లయినా బెదరకుండా మైదానంలో మంచి నీళ్లలా పరుగులు సాధించే కింగ్ విరాట్ కోహ్లికి విమాన ప్రయాణ సందర్భంగా ఓ భయం ఉందట. అదేమంటే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాల్లో వచ్చే జర్క్. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు తీవ్రమైన టర్బులెన్స్ కు గురవుతాయి. ఆ సమయంలో అందరికీ బాగా భయమేస్తుంది. కోహ్లికి మాత్రం చచ్చేంత భయం అట. సీట్ ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఉంటాటడ. కాగా, పక్కనున్న కొందరు ఆ సమయంలో భయం లేకుండా ఉండడాన్ని చూసి అలా ఎలా అని ఆశ్చర్యపోతాడట. దాదాపు 17 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో, అంతకుముందు రెండు మూడేళ్లు దేశీయ క్రికెట్ లో వందల సార్లు విమాన ప్రయాణం చేసిన కోహ్లి ఇప్పటికీ ఆ విమాన ఫోబియా నుంచి బయటపడలేకపోతున్నానని చెబుతున్నాడు. కొన్నిసార్లు విమానం ఎక్కినట్లు కల వచ్చినా ఆందోళన చెందుతాడట.

హిట్ మ్యాన్ కు నీటి గండం

పరిస్థితులు ఎలా ఉన్నా తనదైన శైలిలో మంచినీళ్ల ప్రాయంగా పరుగులు సాధించే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు నీటి గండం ఉందట. భారతీయులు పవిత్ర మాసాల సందర్భంగా నదులు, సముద్రాల్లో పుణ్య స్నానాలు చేస్తుంటారు. కానీ, రోహిత్ కు మాత్రం చిన్నప్పటి నుంచి నీటిలో మునగడం అంటే భయం అట. ఎందుకంటే.. నీటిలో మునిగిన వేళ ఊపిరి బిగబట్టడంతో ప్రాణం పోయినట్లు ఉంటుందట. కొట్టుకుపోతానని భయం వేస్తుంట. అందుకే.. ఎంత కష్టమైన పనైనా చేస్తాను గానీ నీళ్లలో మాత్రం అస్సలు మునగనని చెబుతాడు రోహిత్. ఇది ఎందుకు వచ్చిందో తెలియదని.. ఈ భయం పోగొట్టుకోవడానికి ఈత నేర్చుకున్నానని చెబుతున్నాడు. అయితే, ఈత కొలనులో మునిగినా.. నదులు, సముద్రాల వద్ద మాత్రం ఆ సాహసం చేయలేకపోతున్నట్లు వెల్లడించాడు. బీచ్ లలో గడపడం, ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టడం అంటే మాత్రం రోహిత్ కు బాగా ఇష్టమట.

అమ్మో లిఫ్ట్ ఎక్కడమా?

హార్దిక్ పాండ్యా.. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవాడు. అలాంటివాడు ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న ఆటగాళ్లలో ఒకడు. కాగా, హార్దిక్ కు లిఫ్ట్ అంటే భయమట. ఎందుకంటే.. అవి ఎప్పుడైనా ఆగిపోతాయేమోనని. వాటిలో ఇరుక్కుపోతానని. కొద్దిసేపు నిలిచిపోయినా తట్టుకోలేడట. హార్దిక్ ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనకున్నా.. లిఫ్ట్ లో ఒంటరిగా మాత్రం వెళ్లడట. పక్కన ఎవరినైనా తోడు తీసుకెళ్తానని చెబుతున్నాడు. అలా కాదంటే మెట్లు ఎక్కుతాడట. ఇంజక్షన్‌ అన్నా భయమేనని.. ప్రాక్టీస్‌ లో గాయాలకు, సర్జరీల సమయంలో ఇంజక్షన్ వేస్తుంటే ఎంతో కష్టంగా ఉంటుందని చెబుతున్నాడు.

ఒంటరితనం తట్టుకోలేను

మూడేళ్లుగా భారత క్రికెట్ లో నానుతున్న పేరు సూర్యకుమార్ యాదవ్. మిస్టర్ 360 డిగ్రీ బ్యాట్స్ మన్ గా పేరుతెచ్చుకుని, టి20 కెప్టెన్ కూడా అయిపోయాడు. జట్టు సభ్యులతో అత్యంత సరదాగా ఉండే సూర్య.. నిజ జీవితంలో అంతే సరదాగా ఉండాలని కోరుకుంటాడట. తన చుట్టూ మనుషులుండాలని, వారితో సరదాగా మాట్లాడుతూ ఉండాలని తెలిపాడు. ఒంటరితనం అంటే అంత భయమట. ఎందుకంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయట. భార్య దేవిషా ఇంట్లో లేనప్పుడు కొన్నిసార్లు ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నట్లు చెబుతున్నాడు. రోజంతా ఏదో ఆందోళనగా అనిపించేదని.. ఇలా కాదని కుక్కలను పెంచడం మొదలుపెట్టానని పేర్కొన్నాడు. వాటి పేర్లు పాబ్లో, ఓరియో. ఆ కుక్కలతో ఆడుకుంటూ ఇంట్లో ఎవరూ లేరన్న భావనను దూరం పెడతాడట.

చీకట్లు చీల్చిన సంజూకు..

ప్రతిభావంతుడైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా పదేళ్ల నుంచి వినిపించిన పేరు సంజూ శాంసన్. అయితే, కెరీర్ లో ఎన్నో చీకటి దశలు. ఇటీవలే వాటన్నిటినీ చీల్చుకుంటూ వచ్చాడు. వరుస సెంచరీలతో జోరు మీదున్నాడు. ఇక సంజూకు కాస్త చీకటిగా ఉన్నా భయమేనట. అటూఇటూ కదలకుండా కట్టేసినట్టుండే వాతావరణం అంటే కూడా భయమేనని చెప్పాడు. ఊపిరి ఆడకుండా చెమటలు పట్టేస్తాయని చెప్పాడు. సినిమా థియేటర్లు, ఏసీ బస్సులు, ఏసీ ట్రైన్‌ కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నాడు. రద్దీ ప్రదేశాలకు వెళ్లనని చెబుతున్నాడు. సినిమాలో హాస్య సన్నివేశాలతో ఫోబియాను పోగొట్టుకోవచ్చుగానీ.. ప్రయాణంలో చాలా కష్టంగా ఉంటుందని తెలిపాడు.