Begin typing your search above and press return to search.

మరో ఇద్దరు ఔట్.. టీమ్ ఇండియాలో గాయాలు లేనిది ఎవరికి?

ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ ఎంపీతో పెళ్లి కుదిరిన డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్ కూడా వెన్నునొప్పితో టీమ్ కు దూరమయ్యాడు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 5:30 PM GMT
మరో ఇద్దరు ఔట్.. టీమ్ ఇండియాలో గాయాలు లేనిది ఎవరికి?
X

అత్యంత సీనియర్ నుంచి నిన్న మొన్న వచ్చిన జూనియర్ వరకు.. పేస్ బౌలర్ నుంచి స్పిన్నర దాకా.. ఓపెనింగ్ బ్యాటర్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ వరకు.. టీమ్ ఇండియాలో అందరిదీ ఒకటే ‘గాయం..’ తాజాగా తెలుగు కుర్రాడు, ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికీ గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్ తో టి20 సిరీస్ నుంచి తప్పుకొన్నాడు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ ఎంపీతో పెళ్లి కుదిరిన డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్ కూడా వెన్నునొప్పితో టీమ్ కు దూరమయ్యాడు.

మేటి పేసర్లు షమీ, బుమ్రా, బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. తాజాగా నితీశ్ రెడ్డి, రింకూ సింగ్.. ఇదీ టీమ్ ఇండియాలో ‘గాయ’కుల సంఖ్య. ఈ లెక్కన చూస్తే అసలు జట్టులో గాయాలు లేనిది ఎవరికి? అనే సందేహం రాక మానదు.

గాయాలు అనేవి ఆటగాళ్ల జీవితంలో సహజం. కానీ, టీమ్ ఇండియాలో ఒక్కొక్కరుగా వీటి బారిన పడుతుండడమే ఆందోళన కలిగిస్తోంది. జట్టు నుంచి రిలీవ్ చేసేంతటి పరిస్థితి ఉందంటే అది పెద్ద గాయమే అనుకోవాల్సి వస్తోంది.

150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తాడనే పేరున్న యువ పేసర్ మయాంక్ యాదవ్ ను గత సెప్టెంబరులో బంగ్లాదేశ్ తో టి20ల్లో ఆడించారు. ఆ తర్వాత అతడికి ఏమైందో తెలియదు. అసలే తరచూ గాయాల బారిన పడే అతడు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా సమాచారం లేదు.

ఇటీవల టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను బెదరగొట్టిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అనూహ్యంగా చివరి టెస్టులో గాయపడ్డాడు. ఇది జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది.

పేసర్ షమీ 2023 నవంబరులో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇప్పటికి 15 నెలలు అన్నమాట. కాగా, షమీ దేశవాళీల్లో ఆడి ఫిట్ నెస్ సాధించినట్లు కనిపించాడు. జాతీయ జట్టుకు ఎంపిక చేసినా అతడిని ఆడించడం లేదు.

తాజాగా ఇంగ్లండ్ తో తొలి టి20లో తుది జట్టులో ఉన్న నితీశ్ రెడ్డి, రింకూ సింగ్ గాయంతో దూరం కాగా.. వీరి స్థానంలో శివమ్ దూబె, రమణ్ దీప్ సింగ్ ను తీసుకున్నారు. వీరిలో దూబె కూడా తరచూ గాయపడేవాడే గమనార్హం.

కొసమెరుపు: సెప్టెంబరులో బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపికైన దూబె గాయపడడంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చాన్స్ దక్కింది. ఇప్పుడు తిలక్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అంతకుముందు జింబాబ్వే పర్యటనకు తిలక్ గాయంతో దూరమయ్యాడు. తర్వాత దూబె గాయం ఇతడికి మేలు చేసింది.