విశ్వనాథన్ ఆనంద్ ను దాటిన యంగ్ గ్రాండ్ మాస్టర్!
భారత్ వరకూ చెస్ పేరు చెబితే విశ్వనాథన్ ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపించేది
By: Tupaki Desk | 17 Jan 2024 7:41 AM GMTభారత్ వరకూ చెస్ పేరు చెబితే విశ్వనాథన్ ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే ఇకనుంచి రేపటి తరాలు భారత్ లో చెస్ పేరు చెబితే మరోపేరు బలంగా గుర్తుపెట్టుకుంటుంది. అదే... ఆర్. ప్రజ్ఞానంద! భారత్ తరుపున చెస్ యువ సంచలనంగా మారిన ప్రజ్ఞానంద తాజాగా చరిత్ర సృష్టించాడు. ఫిడే ర్యాంకింగ్స్ లో టాప్ ఇండియన్ అయ్యాడు!
అవును... చెస్ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇందులో భాగంగా తన కెరీర్ లోనే తొలిసారి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను దాటి భారత టాప్ ర్యాంకర్ గా అవతరించాడు. తాజాగా జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్ లో చైనా దేశానికి చెందిన ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ఓడించడంతో ఈ ఘనత అందుకున్నాడు.
దీంతో... ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం 2748.3 పాయింట్లతో ప్రజ్ఞానంద 11వ స్థానంలో ఉండగా... విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్ గా ఈ యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అగ్రస్థానంలోకి ఎగబాకాడు. ఇదే సమయంలో... విశ్వనాథన్ ఆనంద్ తర్వాత, క్లాసికల్ చెస్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ ను ఓడించిన రెండో భారతీయుడిగా నిలిచాడు.
ఇలా యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద భారత నంబర్ వన్ ప్లేయర్ గా అవతరించడంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ స్పందించారు. ఇందులో భాగంగా... ప్రపంచ ఛాంపియన్ ను ఓడించి ఈ ఘనత అందుకున్నావు.. నిన్ను చూసి ఈ దేశం గర్వపడుతోంది అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా... ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.