Begin typing your search above and press return to search.

‘పృథ్వీ షా’క్.. ముంబై రంజీ జట్టు నుంచి యువ బ్యాట్స్ మన్ ఔట్

అంతా బాగున్న స్థితిలో అనూహ్య గాయం.. ఆపై క్రమశిక్షణ రాహిత్యం.. ఫామ్ కోల్పోవడం.. ఫిట్ నెస్ కూడా దెబ్బతినడంతో ముంబై క్రికెటర్ పృథ్వీ షా బ్యాడ్ లక్ అనుకోవాలి.

By:  Tupaki Desk   |   22 Oct 2024 7:36 AM GMT
‘పృథ్వీ షా’క్.. ముంబై రంజీ జట్టు నుంచి యువ బ్యాట్స్ మన్ ఔట్
X

ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు ఎంపికవడం ఎంత కష్టమో.. అందులో చోటు నిలుపుకోవడమూ అంతే కష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఏక కాలంలో నాలుగు అంతర్జాతీయ జట్లను తయారు చేయగల స్థితిలో ఉంది భారత్. దీంతో ఏమాత్రం ప్రతిభ ఉన్నా ఎక్కడో ఒకచోట అవకాశం కల్పిస్తోంది. అయితే, కెప్టెన్ గా దేశానికి అండర్ 19 ప్రపంచ కప్ అందించి.. కేవలం 18 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు టెస్టు మ్యాచ్ ఆడి.. అందులో సెంచరీ కొట్టి.. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్నవాడిలా కనిపించిన కుర్రాడు ఇప్పుడు ఎందుకూ కాకుండా పోతున్నాడు. టీమ్ ఇండియా అనేక జట్లుగా మారి మ్యాచ్ లు ఆడుతుంటే.. వాటిలో దేంట్లోనూ లేడు.


క్రమశిక్షణ లేకుంటే అంతే..

అంతా బాగున్న స్థితిలో అనూహ్య గాయం.. ఆపై క్రమశిక్షణ రాహిత్యం.. ఫామ్ కోల్పోవడం.. ఫిట్ నెస్ కూడా దెబ్బతినడంతో ముంబై క్రికెటర్ పృథ్వీ షా బ్యాడ్ లక్ అనుకోవాలి. 16 ఏళ్లకే రంజీ మ్యాచ్ ఆడి సెంచరీ కొట్టిన అతడు.. ఇపుడు ఎంత గొప్పగా ఆడినా జాతీయ జట్టులోకి వచ్చేలా లేడు. అలాగని ప్రతిభకు లోటు లేని వాడేం కాదు. అయితే, క్రమశిక్షణ కొరవడడం, ఫిట్‌ నెస్‌ లోపంతో కెరీర్‌ ను దెబ్బతీసుకుంటున్నాడు. ఇప్పటికే అతడు టీమ్ ఇండియాకు దూరమై మూడున్నరేళ్లయింది. భారత్ తరఫున అతడు 2021 జూలైలో చివరగా శ్రీలంకతో టి20 మ్యాచ్‌ ఆడాడు.

అంతర్జాతీయ కెరీర్ ఖతమే?

పృథ్వీ షా వయసు 24 మాత్రమే. 2018లోనే వెస్టిండీస్ పై టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ కొట్టాడు. వాస్తవానికి 2018 అండర్ 19 ప్రపంచ కప్ లో షా కెప్టెన్ అయితే, శుబ్ మన్ గిల్ వైస్ కెప్టెన్. అలాంటిది గిల్ ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడు. పైగా టి20ల్లో వైస్ కెప్టెన్ కూడా. కానీ, షా మాత్రం కెరీర్‌ ను నాశనం చేసుకుంటున్నాడు. తన చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటోంది. దీంతో క్రికెట్ నుంచి ఫోకస్ మళ్లుతోంది. తాజాగా మొదలైన రంజీ ట్రోఫీలో సొంత జట్టు, డిఫెండింగ్ చాంపియన ముంబైకి ఒక మ్యాచ్ ఆడిన అతడిని తర్వాతి మ్యాచ్ కు పక్కనపెట్టారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ దీనిపై స్పష్టమైన కారణం చెప్పకున్నా.. ఫిట్‌ నెస్‌, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే షాపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నెట్‌ సెషన్స్‌ కు ఆలస్యంగా రావడం, ఎప్పుడంటే అప్పుడు డుమ్మా కొట్టడం, సీరియస్‌ గా ప్రాక్టీస్ చేయకపోవడం వంటి కారణాలతో ముంబై క్రికెట్ అసోసియేషన్ విసిగిపోయిందట. పైగా షా అధిక బరువు కారణంగా ఫిట్‌ నెస్‌ కూడా లేదట. దీంతో ముంబై సెలక్టర్లు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారట. జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో పాటు కెప్టెన్ అజింక్య రహానే, కోచ్‌ కూడా దీనిని సమర్థించినట్లు సమాచారం.