"ఓం సాయిరాం"... ఐపీఎల్ అన్ సోల్డ్ ఆటగాడి ఆసక్తికర పోస్ట్!
కాలం కలిసి రాకపోతే ఎంత పెద్ద ఓడ అయినా బండి అయిపోతుందని.. అన్నీ అనుకూలంగా సాగితే బండి కూడా ఓడగా మారిపోతుందని అంటుంటారు.
By: Tupaki Desk | 17 Dec 2024 4:58 PM GMTకాలం కలిసి రాకపోతే ఎంత పెద్ద ఓడ అయినా బండి అయిపోతుందని.. అన్నీ అనుకూలంగా సాగితే బండి కూడా ఓడగా మారిపోతుందని అంటుంటారు. అందుకే... ప్రధానంగా సినిమా, క్రికెట్, రాజకీయం వంటి భారీ రంగాల్లో గుమ్మడికాయ అంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా మస్ట్ అని చెబుతుంటారు. పృథ్వీ షా గురించి ఇప్పుడు ఇదే చర్చ అని అంటున్నారు!
అవును... టీమిండియా యంగ్ బ్యాటర్ పృథ్వీ షా కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తందని అంటున్నారు. ఇప్పటికే జాతీయ జట్టుకు దురమైన షా.. ఐపీఎల్ మెగా వేలంలోనూ అన్ సోల్డ్ గా మిగిలిపోవడం గమనార్హం. ఇక ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై చాంపియన్ గా నిలిచినప్పటికీ అందులో పృథ్వీషా వాటా అతి స్వల్పం అనే చెప్పాలి!
ఆ ట్రోఫీలో భాగంగా 9 మ్యాచ్ లలో 197 పరుగులు మాత్రమే చేసిన పృథ్వీ షా... మధ్యప్రదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 10 పరుగులకే ఔటయ్యాడు. దీంతో... ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీ మొదటి మూడు మ్యాచ్ లకు ప్రకటించిన ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు.
ఇలా విజయ్ హజారే ట్రోఫీ మొదటి మూడు మ్యాచ్ లకూ తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తన లిస్ట్ ఎ క్రికెట్ ఘణాంకాలను వెల్లడిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ సందర్భంగా... "దేవుడా చెప్పు.. నేను ఇంకా ఎన్ని పరుగులు చేయాలి?" అంటు మొదలుపెట్టిన పృథ్వీ షా... లిస్ట్ ఎ క్రికెట్ లో 65 ఇన్నింగ్స్ లో 55.7 యావరేజ్ తో 126 స్ట్రైక్ రేట్ తో 3,399 పరుగులు చేసినట్లు తెలిపాడు. అయినప్పటికీ.. తనను ఎంపిక చేయడానికి ఈ గణాంకాలు సరిపోవు.. కానీ నేను మీపై (దేవుడిపై) నమ్మకం ఉంచుతాను అని రాసుకొచ్చాడు.
ఇదే సమయంలో... తాను దేవునిపై విశ్వాసాన్ని ఉంచుతాను.. ప్రజలు ఇప్పటికీ తనపై నమ్మకం ఉంచుతారని ఆశిస్తున్నాను.. ఎందుకంటే తాను తప్పకుండా తిరిగి వస్తాను అని రాస్తూ... "ఓం సాయిరాం" అంటూ ముగించాడు షా. ఇప్పుడు ఈ పోస్ట్ ఆసక్తిగా మారింది.