ఒక్కసారీ కప్పు కొట్టలేదు కానీ..ఆ ఐపీఎల్ జట్టుకు 17 మంది కెప్టెన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పటికే 17 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది. 18వ సీజన్ తేదీలు నిన్ననే విడుదల కూడా అయ్యాయి
By: Tupaki Desk | 13 Jan 2025 5:30 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పటికే 17 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది. 18వ సీజన్ తేదీలు నిన్ననే విడుదల కూడా అయ్యాయి. ఇక మిలిగింది ఏ మ్యాచ్ ఎప్పుడా? అనే షెడ్యూలే. నవంబరులోనే మెగా వేలం పూర్తయి రికార్డులు నెలకొల్పింది. వాస్తవానికి 2025 సీజన్ నుంచి ఐపీఎల్ లో అనేక మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ఆసక్తికరంగా మారనుంది. అంతేకాదు ఈ సీజన్ లో పలు జట్లకు కెప్టెన్లు మారనున్నారు.
కోల్ కతా నైట్ రైడర్స్ కు గత సీజన్ లో కప్ అందించాడు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ఈ సీజన్ లో మాత్రం అతడిని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. అయ్యర్ అధిక మొత్తం డిమాండ్ చేయడమే దీనికి కారణం అనే మాట వినిపించింది. అయితే, శ్రేయస్ ను అతడు ఊహించినదానికంటే ఎక్కువే చెల్లించి రూ.26.75 కోట్లకు పాడుకుంది పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద మొత్తం కావడం విశేషం.
రాబోయే సీజన్ కు అయ్యర్ నే తమ కెప్టెన్ గానూ ప్రకటించింది పంజాబ్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ కు సారథ్యం చేశాడు అయ్యర్. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను కూడా నడిపించనున్నాడు. అంటే ఒకే లీగ్ లో మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్సీ చేసిన రికార్డును సొంతం చేసుకోనున్నాడు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు కప్ కొట్టని జట్లు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్. కాగా, లక్నో మూడేళ్ల కిందటే వచ్చింది. మిగతా మూడు జట్లూ 17 సీజన్లుగా ఉన్నాయి. కానీ, కప్ మాత్రం కొట్టలేదు. 2014 లో మాత్రం ఫైనల్స్ కు చేరింది.
17వ కెప్టెన్..
పంజాబ్ కింగ్స్ అనుకోని ఓ రికార్డును మూటగట్టుకుంది. అదేమంటే ఇప్పటివరకు 17 మంది కెప్టెన్లు ఆ జట్టును నడిపించారు. వీరిలో టీమ్ ఇండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నుంచి దిగ్గజాలు సంగక్కర, జయవర్దనే (శ్రీలంక), గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. కెప్టెన్ల జాబితా చూస్తే.. జితేశ్ శర్మ, మయాంక్ అగర్వాల్ వంటి వారితో పాటు శిఖర్ ధావన్, సామ్ కరన్, కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, అశ్విన్ డేవిడ్ హస్సీ, జార్జి బెయిలీ తదితరులు ఉన్నారు.