నాడు కోచ్ తో కుంగుబాటు.. నేడు మైదానంలో సంచలనం
ప్రాక్టీస్ మ్యాచ్ లో 45 బంతుల్లోనే 90 పరుగులు చేశానని.. జిమ్ కు వెళ్లి హోటల్ కు వచ్చేసరికి జట్టులో నుంచి తప్పించినట్లు తెలిసిందన్నాడు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యానన్నాడు.
By: Tupaki Desk | 6 April 2024 4:30 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు రోజుల కిందట గుజరాత్ టైటాన్స్-పంజాబ్ మధ్య మ్యాచ్. 200 పరుగుల టార్గెట్. కానీ, పంజాబ్ 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక ఆ జట్టు గతి ఇంతే అని..ఓటమి ఖాయం అని అనుకుంటుండగా అద్భుతం జరిగింది. చివరకు మ్యాచ్ లో పంజాబ్ గెలిచింది. దీనంతటికీ ఓ కుర్ర క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, అతడి గతం గురించి తెలుసుకుంటే మాత్రం ఔరా అని అనక మానరు.
అక్కడ అతడు.. ఇక్కడ ఇతడు ఈ సీజన్ ఐపీఎల్ లో అందరూ చర్చించుకుంటున్న పేరు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ది. కానీ, పంజాబ్ బ్యాట్స్ మన్ ఆశుతోష్ శర్మ గురించి కూడా చెప్పుకోవాలి. గుజరాత్ తో మ్యాచ్ లో జట్టు ఓటమి ముంగిట ఉండగా.. ఆశుతోష్ బరిలో దిగి 17 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, ఒక సిక్స్ తో అతడు చెలరేగి ఆడి.. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్స్ లు)కు అండగా నిలిచాడు. కాగా, ఇప్పుడు ఆశుతోష్ సంచలన విషయం బయటపెట్టాడు.
కోచ్ కుంగదీశాడు..2020-22 సీజన్ లో ఒక కోచ్ కారణంగా తాను కుంగిపోయానని మైదానంలోకి అడుగుపెట్టేందుకు కూడా ఇష్టపడలేదని చెప్పాడు. అది తన జీవితంలో అత్యంత కఠినమైన రోజుగా చెప్పాడు. ఇది జరిగింది2020 సీజన్ లో అని తెలిపాడు. అప్పట్లో మంచి ప్రదర్శనే చేశానని. కానీ, మధ్యప్రదేశ్ కొత్త కోచ్ తనపై వివక్ష చూపాడని ఆరోపించాడు. జట్టులోని కొందరిపై బలమైన నమ్మకం పెట్టుకున్న అతడికి తాను నచ్చలేదని తెలిపాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో 45 బంతుల్లోనే 90 పరుగులు చేశానని.. జిమ్ కు వెళ్లి హోటల్ కు వచ్చేసరికి జట్టులో నుంచి తప్పించినట్లు తెలిసిందన్నాడు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యానన్నాడు. దీనికిముందు సీజన్‌లో ముస్తాక్ అలీ ట్రోఫీలో 6 మ్యాచ్ లలో మూడు హాఫ్ సెంచరీలు చేసిన సంగతిని గుర్తుచేశాడు. అయినా కనీసం మైదానంలోకి కూడా అనుమతించలేదని వాపోయడు. దీంతో కుంగుబాటుకు గురైనట్లు చెప్పాడు.
ఆ కోచ్ చంద్రకాంత్ పండిట్..ఆశుతోష్ ఆరోపణలు చేసిన కోచ్ పేరు చంద్రకాంత్ పండిట్. టీమిండియాకు కొన్ని మ్యాచ్ లు ఆడిన పండిట్.. దేశవాళీలో మాత్రం గొప్ప కోచ్ గా పేరుతెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్ ను రంజీ చాంపియన్ గా నిలపడంలో అతడిదే కీలక పాత్ర. కాగా, నమీబియా ఆటగాడు డేవిడ్ వీజ్, మధ్యప్రదేశ్ మాజీ పేసర్ గౌరవ్ యాదవ్ కూడా గతంలో పండిట్ వ్యవహార శైలిని తప్పుబట్టారు.