శశాంక్ మెరుపు దాడి... ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం!
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ - పంజాబ్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది.
By: Tupaki Desk | 5 April 2024 4:09 AM GMTఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ - పంజాబ్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్... బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం ఆధ్యంతం ఈ మ్యచ్ ఎంత రసవత్తరంగా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!
తొలి ఓవర్ లోనే సంకేతాలిచ్చిన శుభ్ మన్ గిల్!:
హర్ ప్రీత్ బ్రార్ వేసిన తొలి ఓవర్లో మొదటి ఐదు బంతులలో ఒకే పరుగు రాగా.. చివరి బంతికి శుభ్ మన్ గిల్ (6) సిక్సర్ బాదాడు. అర్ష్ దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ లో 11 పరుగులు రాబట్టారు. దీంతో.. రెండు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగులకు చేరుకుంది. ఈ సమయంలో... శుభ్ మన్ గిల్ (8), వృద్ధిమాన్ సాహా (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
గుజరాత్ ఫస్ట్ వికెట్ డౌన్!:
కగిసో రబాడ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ధావన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు వృద్ధిమాన్ సాహా. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 29 పరుగులకు చేరింది.
పవర్ ప్లే పూర్తయ్యే సరికి పరిస్థితి ఇది!:
సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్ లో రెండు ఫోర్లు బాదిన విలియమ్సన్ (16) నిలకడగా ఆడుతున్నాడు. మరోపక్క శుభ్ మన్ గిల్ (19) పరుగులతో ఉన్నాడు. దీంతో 6 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టపోయిన గుజరాత్... 52 పరుగులు చేసింది.
గుజరాత్ రెండో వికెట్ డౌన్!:
హర్ ప్రీత్ బ్రార్ వేసిన తొమ్మిదో ఓవర్ లో మూడో బంతికి కేన్ విలియమ్సన్ 26 (22 బంతులలో) బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 9 ఓవర్లు పూరయ్యేసరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.
గుజరాత్ మూడో వికెట్ డౌన్!:
హర్షల్ పటేల్ వేసిన 14 ఓవర్ లో ఐదో బంతికి సాయి సుదర్శన్ 33 (19 బంతులలో) వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోపక్క శుభ్ మన్ గిల్ (46) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. దీంతో... 14 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులకు చేరుకుంది.
శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ!:
తొలిబంతి నుంచీ నిలకడగా ఆడుతున్న శుభ్ మన్ గిల్... హర్ ప్రీత్ బ్రార్ వేసిన 15 ఓవర్ నాలుగో బంతికి బౌండరీ బాది 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దీంతో 15 ఓవర్లో గుజరాత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులకు చేరుకుంది.
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్!:
రబాడ వేసిన 18వ ఓవర్ లో మొదటి రెండు బంతులకు గిల్ వరుసగా 6, 4 బాదగా... అదే ఓవర్ లో నాలుగో బంతికి విజయ్ శంకర్ (8) ఔటయ్యాడు. దీంతో 18 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన గుజరాత్ 166 పరుగులు చేసింది.
పంజాబ్ ముందు భారీ టార్గెట్ పెట్టిన గుజరాత్!:
అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యచ్ లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. ఇందులో భాగంగా... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్స్ లో శుభ్ మన్ గిల్ 89* (48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు) తన అడ్డాలో చెలరేగిపోగా... సాయి సుదర్శన్ 33 (19 బంతుల్లో 6 ఫోర్లు) కేన్ విలియమ్సన్ 26 (22 బంతుల్లో 4 ఫోర్లు) సహకరించారు. ఇక రాహుల్ తెవాటియా 23 (8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో మెరుపులు మెరిపించాడు.
పంజాబ్ ఫస్ట్ ఓవర్ లో జోరు, రెండో ఓవర్ లో షాక్!:
గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ దూకుడుగానే ప్రారంభించింది. ఇందులో భాగంగా... ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్ లో జానీ బెయిర్ స్టో (12) మూడు ఫోర్లు బాదాడు. అనంతరం... ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్ లో తొలి బంతికి కెప్టెన్ శిఖర్ ధావన్ (1) ఔటయ్యాడు. దీంతో... రెండు ఓవర్లు పూరయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి పంజాబ్ స్కోరు 19 పరుగులకు చెరుకుంది.
పంజాబ్ రెండో వికెట్ డౌన్!
నూర్ అహ్మద్ వేసిన ఆరో ఓవర్లో తొలి బంతికి బెయిర్ స్టో (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో... పవర్ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులకు చేరుకుంది.
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్!:
నూర్ అహ్మద్ వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతికి దూకుడుగా ఆడుతున్న ప్రభ్ సిమ్రన్ సింగ్ 35 (24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. దీంతో 8 ఓవర్లు పూరయ్యే సరికి 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 64 పరుగులు చేసింది.
తడబడిన పంజాబ్... ఫోర్త్ వికెట్ డౌన్!:
భారీ లక్ష్య చేదనలో పంజాబ్ కాస్త తడబడింది. ఇందులో భాగంగా... ఒమర్జాయ్ వేసిన 8.4 ఓవర్ కు సామ్ కరన్ (5) ఔటయ్యాడు. దీంతో 9 ఓవర్లు పూరయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 73 పరుగులు చేసింది.
పుంజుకున్న పంజాబ్ బ్యాటర్లు!:
ఉమేశ్ యాదవ్ వేసిన 11 ఓవర్ లో శశాంక్ సింగ్ వరుసగా 4, 6, 4 సాధించాడు. నూర్ అహ్మద్ వేసిన 12 ఓవర్ లోనూ 10 పరుగులు రాబట్టారు. దీంతో 12 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 110 పరుగులు చేసింది.
ఐదో వికెట్ డౌన్!:
మోహిత్ శర్మ వేసిన 13 ఓవర్ రెండో బంతికి సికిందర్ రజా (15) ఔటయ్యాడు. దీంతో 111 పరుగుల వద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో శశాంక్ సింగ్ (33) జితేశ్ శర్మ (1) క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో పంజాబ్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 119.
పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది!:
రషీద్ ఖాన్ వేసిన 16 ఓవర్ లో మొదటి రెండు బంతులకు సిక్స్ లు బాది దూకుడుమీద కనిపించిన జితేశ్.. తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లు పూరయ్యే సరికి పంజాబ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు. అంటే... పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాలి.
ఉత్కంఠగా మారిన మ్యాచ్!:
మోహిత్ శర్మ 17 ఓవర్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆరు పరుగులే ఇవ్వగా... ఒమర్జాయ్ వేసిన 18 ఓవర్ లో మూడు ఫోర్ల సాయంతో 16 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో 18 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 175 పరుగులు చేసింది. క్రీజ్ లో శశాంక్ (50), ఆశుతోష్ (22) పరుగులతో ఉన్నారు. అంటే... చివరి 2 ఓవర్లలో పంజాబ్ కు 25 పరుగులు కావాలి!
6 బంతుల్లో 7 పరుగులు!:
మోహిత్ శర్మ వేసిన 19 ఓవర్ లో రెండో బంతికి ఆశుతోష్, చివరి బంతికి శశాంక్ సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్ లో 18 పరుగులు వచ్చాయి. దీంతో... పంజాబ్ కు చివరి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి! ఈ సమయంలో 20 ఓవర్ ఫస్ట్ బంతికే ఆశుతోష్ (31) ఔటయ్యాడు.
ఉత్కంఠ పోరులో పంజాబ్ దే విజయం!:
గుజరాత్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్స్ లో శశాంక్ సింగ్ 61* (29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు), ఆశుతోష్ శర్మ 31 (17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు.